Begin typing your search above and press return to search.

జీవితమే అసలైన గురువు

గురువు అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా నడిపించేవాడు. సమస్యకు పరిష్కారం చూపించేవాడు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుగా తీసుకుని వెళ్ళేవాడు.

By:  Satya P   |   5 Sept 2026 1:35 PM IST
జీవితమే అసలైన గురువు
X

గురువు అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా నడిపించేవాడు. సమస్యకు పరిష్కారం చూపించేవాడు. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుగా తీసుకుని వెళ్ళేవాడు. గురువు పాత్ర ప్రతీ వారి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. గురువు లేకుండా ఎవరూ జీవితంలో ఎదిగినది లేదు, గురువు చెప్పే బోధనలు జీవిత పర్యంతం గుర్తుండిపోవడమే కాదు సమస్యల వలంలో చిక్కుకున్న ప్రతీసారి పరిష్కార మార్గాలుగా ఉపయోగపడతాయి. అందుకే గురువు పాత్ర ప్రతీ వారి జీవితంలో ఎంతో ముఖ్యం. ఒక్కసారి వెనక్కి వెళ్తే మహా భారత గాధలలో ద్రోణాచార్యులు అనే గొప్ప గురువు ఉండేవారు. అతని వద్దనే కౌరవ పాండవులు విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. వారి కోసం మంచి గురువు కావాలని తాత భీష్ముడు వెతికి మరీ ద్రోణుడిని తమ రజాస్థానికి తెచ్చి మరీ ఆచార్య బాధ్యతలు అప్పగించారు. ఆయన శిష్యరికంలో కౌరవులు పాండవులు ఎంతో రాటుదేలారు.

ఏకలవ్యుడికి సైతం :

అయితే ఏకలవ్యుడికి గురువు కూడా ద్రోణాచార్యుడే. కానీ గురుముఖంగా ఆయన నేర్చుకోలేదు. తనకి విద్యను అందించమని ద్రోణుడి వద్దకు ఏకలవ్యుడు వెళ్తాడు. అయితే ఏకలవ్యుడికి విద్యను అందించేందుకు ద్రోణుడు తిరస్కరిస్తాడు. కానీ ఏకలవ్యుడు మాత్రం ద్రోణుడినే తన గురువుగా భావించి ఆయన మట్టి ప్రతిమను చేసుకుని గురువును మనసులోనే ప్రతిష్టించుకుని ఆయన వద్దను పరోక్షంగా విద్యను గడించి కౌరవ పాండవుల కంటే కూడా గూప విలుకాడు అవుతాడు. అలా గురుముఖంగా లేకపోయినా పరోక్షంగా నేర్చుకున్న వారు కూడా ఎందరో కనిపిస్తారు. అంటే గురువు పేరు చెప్పుకుంటే చాలు శిష్యుడికి సరస్వతీ కటాక్షం అవుతుంది అన్న మాట.

చత్రపతి శివాజీకి గురువు :

ఇక మరాఠీ యోధుడు చత్రపతిగా చరిత్రలో కీర్తిని గడించిన శివాజీకి కూడా ఒక అద్భుతమైన గురువు ఉన్నారు. ఆయనే సమర్ధ రామదాసు. సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ మహారాజుకు ఆధ్యాత్మిక బోధనతో పాటు త గురువుగా మార్గదర్శనం చేశారు. శివాజీకి హిందూ స్వరాజ్య స్థాపనలో దారి చూపించారు. శివాజీ తన జీవిత పర్యంతం ధర్మ మార్గంలో నడవడానికి సమర్థ రామదాసు ఆధ్యాత్మిక గురువుగా ఆయన ఎదుట నిలిచి దీవెనలు అందించారు. అంతే కాదు ఆనాటి ప్రజలలో నైతికతను భక్తిని సమర్ధ రామదాసు బోధనలు పెంపొందించాయి. అప్పటి సమాజంలో జాతీయ భావాలను కూడా సమర్ధ రామదాస్ వ్యాప్తి చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో గురువులు ఉన్నారు.

జీవితం నుంచి కూడా :

పాఠ్యాంశాలను బోధించే వారు జీవితాన్ని ఇస్తారు. అయితే జీవితంలో అడుగడుగునా ఎంతో మంది గురువులు ఎదురవుతూ ఉంటారు. మన అమాయకత్వం అజ్ఞానాన్ని తొలగించేందుకు జీవితం పెద్ద గురువుగా కీలక పాత్రను పోషిస్తుంది. ఒక తప్పు చేస్తేనే తప్ప ఒప్పు ఏమిటో తెలియదు. అపుడే జీవిత సారం అర్ధం అవుతుంది. మంచి చెడుల మధ్య తేడా తెలియక కొట్టుమిట్టాడే దశలో కూడా జీవితంలో ఎదురు దెబ్బలు తప్పవు. అలా ఎదురైన దెబ్బల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలి. ఒకసారి దెబ్బ తింటే మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, ఇక ఎవరి పట్ల ఎలా వ్యవహరించాలి అన్నది కూడా జీవితమే బోధ చేస్తుంది. అనుభవ సారంతోనే పాఠాలు ఎవరైనా ఇక్కడ నేర్చుకుంటారు. ఏ విషయంలో అయినా తాను మోసపోయాను అనుకుంటే బాధ కలుగుతుంది, కానీ మరు క్షణం తెలుసుకుంటే అది ఒక పాఠంగా మారుతుంది.

బంధాలు భావోద్వేగాలు :

ఎవరితో బంధం ఎలా ఉండాలి, ఎంత వరకూ ఉండాలి ఇవన్నీ కూడా ఏ గురువు కూడా చెప్పరు, జీవితమే నేర్పిస్తుంది. అలాగే ఆవేదన ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ కూడా జీవితం నేర్పే పాఠాలుగానే చూడాలి, ఎవరైనా బాధ పెడితే అది మనస్సులో నిలిచిపోతుంది. కానీ ఆ బాధ నుంచి కూడా పాఠం నేర్చుకుంటే తిరిగి అటువంటిది మళ్లీ చేయకుండా ఉండగలరు. విద్యతో పాటు సమాజం పట్ల బాధ్య, అవగాహన, కుటుంబం పట్ల నిబద్ధత, బంధాలను అందంగా ఎలా మార్చుకోవాలి ఇవన్నీ జీవితం నేర్పే పాఠాలు. అంతే కాదు అనర్హులకు అందలాలు ఎక్కిస్తే ఏమవుతుంది, అపాత్రదానం వల్ల కలిగే ఇబ్బందులు ఇలా ప్రతీ విషయంలోనూ జీవితం చేయి పట్టుకుని చెప్పే పాఠాలు ఎంతో గొప్పవి. అందువల్ల గురువు అంటే జీవితంలో మొదటి అడుగు నుంచి చివరి వరకూ ఎక్కడో ఒక చోట ఏదో రూపంలో కనిపిస్తూనే ఉంటాడు.

ప్రకృతి పాఠాలు :

గురువు విషయంలో చిన్న వాడు అని చూడాల్సిన పని లేదు, వయసు, ఆడ మగ కులం మతం ఇలా ఏ భేదాలు లేనిది గురువు పాత్ర. అలాగే భౌతిక రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు, నీ ఆలోచన ఎంత పెరిగితే అంతగా పాఠాలను నేర్చుకోగలవు, ఒక్కసారి సముద్ర కెరటాలను చూస్తే చాలు అవి నింగిని చుంబించాలని పడే తాపత్రయంలో ఎగిసి పడే తీరు కూడా ఒక పెద్ద పాఠం. ఓటమి ఎంత వేధించినా జీవితంలో నిరంతరం ప్రయత్నం చేయమని నిశ్శబ్దంగా హిత బోధ చేసే కడలి కెరటం కంటే పెద్ద గురువు ఎక్కడ ఉన్నారు. అలాగే పక్షులు పశువులు ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తూ వర్తమానంలోనే జీవిస్తూ ఆహ్లాదంగా బతుకుని ఎలా గడపాలో బోధిస్తాయి. అందుకే అడుగునా గురువు ముద్ర ఉంది. తరచి చూస్తేనే ఆ సారం అర్ధమవుతుంది.