Begin typing your search above and press return to search.

వచ్చింది... ఇచ్చి పోవడానికి !

ఎవరూ కూడా ఎప్పటికీ మరొకరితో పోల్చుకోవడం చేయకూడదు. ప్రతీ వారికీ సొంత సామర్థ్యం ఉంటుంది. దానిని పదును పెట్టేందుకు చూసుకోవాలి.

By:  Satya P   |   7 Jun 2026 11:40 AM IST
వచ్చింది... ఇచ్చి పోవడానికి !
X

చాలా మంది జీవితాన్ని తక్కువగా చూస్తారు. తమకు ఉన్న దానిని తక్కువ చేసుకుంటారు. నిరంతరం నిరాశ నిస్పృహలతో మనసును నింపి ఉంచుతారు. ఎంతసేపు నిర్వేదంతో ఉంటారు. ఎందుకీ బతుకు అనుకుంటారు. తమకంటే ఇతరులు ఎంతో గొప్పగా హాయిగా బతుకుతున్నారు అని కూడా భావిస్తారు. ఇలా తమని తగ్గించుకుంటూ అవతల వారిని చూసి అసూయ చెందుతూ ఆ వేడిలోనే కాలిపోతూంటారు. నిజంగా చూస్తే ప్రతీ ఒక్క జీవితం అమూల్యం. మనిషిగా ఈ భూమి మీద పుట్టడమే ఒక గొప్ప బహుమతి అన్నది ఎంత మంది అర్థం చేసుకుంటున్నారు. తాము ఎవరికీ తీసిపోమని తమకు కూడా దేవుడు అన్ని రకాలైన శక్తులు ఇచ్చారని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు. ఇవన్నీ ప్రశ్నలు. ఎవరికి వారుగా మనసుని వికసింపజేసి చీకటి మెదళ్ళను చీల్చుకుని వెలుగు రేఖలను అందులో చొప్పించి తెలుసుకోవాల్సిన విషయాలు.

ఎప్పటికీ తక్కువ కావు :

ఎవరూ కూడా ఎప్పటికీ మరొకరితో పోల్చుకోవడం చేయకూడదు. ప్రతీ వారికీ సొంత సామర్థ్యం ఉంటుంది. దానిని పదును పెట్టేందుకు చూసుకోవాలి. అంతే తప్ప తమ బతుకులు ఇంతే అని ఏడుస్తూ మూసిన తలుపుల వెనకాల మగ్గుతూ గడపడం అంటే జీవితాన్ని చేజేతులా వృధా చేయడమే. ఇక జీవితంలో ఎదిగేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. తమాషా ఏమిటి అంటే జీవితం అన్నది చివరి ఊపిరి వరకూ అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ పట్టుబట్టాలే కానీ పట్టుదలగా పనిచేయాలే కానీ ఎన్నో రకాలైన గేట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. కావాల్సింది సంకల్పబలం, ఏదైనా చేయాలని భావించడం, తమకు తాముగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం. అలా చేసిన నాడు విజయాలు వెంటనే రాకపోయినా ఆలస్యంగా అయినా వస్తాయి. అవి ఎప్పటికీ మనిషిని నిరాశ పరచే ప్రసక్తి అన్నదే ఉండదు.

యాక్సిడెంటల్ గానే జరగాలి :

మనిషి పుట్టుక ఒక యాక్సిడెంట్. అవును ఇది నిజం. అలాగే మరణం కూడా యాక్సిడెంటల్ గానే జరగాలి. ఎలా పుట్టావో అలాగే జీవితాన్ని ముగించాలి. అంతే తప్ప చావుని చేతులలోకి తీసుకోకూడదు. జీవం పోసే సత్తా లేని వాడికి చంపే హక్కు చచ్చే హక్కూ రెండూ లేవు.అందువల్ల పుట్టుక చావుల గురించి వదిలేస్తే ఈ మధ్యన ఉన్నది అంతా జీవితం. అది నీ సొంతం. దానిని ఎలా అందంగా గొప్పగా మలచుకుంటున్నావు అన్నది మాత్రం నీ చేతిలోనే ఉంది. దానిని వదిలేసి చావుని ఆహ్వానించడం అంటే ఆట మధ్యలో పిరికిపందలా తప్పుకోవడమే అవుతుంది. సవాళ్ళకు భయపడి చీకటి గుహలో దాక్కోవడమే అవుతుంది. ఇలా బేలగా దైన్యంగా మారిన వారు జీవితంలో ఏమీ సాధించలేరు, తమకు వారు ఏమీ కారు, తమ వారికీ ఏమీ చేయలేరు.

ఊరకే పుట్టలేదుగా :

నీవు ఊరకే పుట్టలేదు అన్న సత్యాన్ని ముందు తెలుసుకోవాలి. ప్రతీ పుట్టుకకూ ఒక అర్ధం పరమార్ధం ఉంటుంది. అంతటి సముద్రంలో నీటి బిందువు ఎంతని కాదు, అది కూడా కడలిని కదిలించే ప్రయత్నం చేస్తుంది. క్షణ భంగురం జీవితం అని అల అనుకుంటే అలా కదిలేదా ప్రకంపనలు రేపేదా. అందువల్ల అలను చూసి నేర్చుకోవాలి, అవాస్తవికమైన కలల ప్రపంచం నుంచి బయటకు రావాలి. నీ సామర్ధ్యాలను తెలుసుకుని పదును పెడితే తప్పకుండా అనుకున్నది సాధించడం తధ్యం.

ఎంతో కొంత ఇచ్చిపో :

పుట్టడం చావడం మధ్య ఉన్న జీవితం నీది మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానిది కూడా. సమాజం అంటే ఏదో వేలు లక్షల కోట్లు జనాభా అనుకోవద్దు, నీ వారు, నీ కుటుంబీకులు, బంధువులు పరిచయస్థులు, స్నేహితులు వారు కూడా సమాజమే. అంతే కాదు లేని వాడు కాని వాడు ఎవరైనా ఉంటే వారిని కూడా సమాజంలో భాగంగానే చూడాలి. అందరినీ సమాదరించడం వల్ల కాకపోయినా కొందరిని అయినా ఆదరించే గుణం పెంచుకోవాలి. ప్రేమను అయినా కనీసం పంచే లక్షణం ఉండాలి. ఓదార్పుని అయినా ఇచ్చే ఔదార్యాన్ని కూడా కలిగి ఉండాలి. చివరాఖరికి చెప్పేది ఏంటంటే నీవు అంటే ఒంటరివి కాదు. సమాజంలో భాగానికి. సముద్రంలో ఉన్న అల ఎలా అంతులేని కడలికి కనెక్ట్ అయి ఉంటుందో అలాగే సమాజంతో ముడి పడి ఉన్న జీవితం నీది. ఆ జీవితాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. వీలుంటే పరిమితంగా అయినా నీ ఉనికిని చాటుకో ఇంకా వీలైతే సమాజం అంతటికీ అది విస్తరించు. నీవు ఈ భూమి మీదకు వచ్చింది జస్ట్ అలా పుట్టి పెరిగి చచ్చిపోవడానికి మాత్రం కాదు. ఎంతో కొంత ఇచ్చిపోవడానికి. అది గుర్తు ఎరిగిన వాడు నీ కంటే గొప్పోడు ఈ భూమి మీద ఉండడు అని నీవే తెలుసుకుంటావు.