సొంత కరెన్సీ లేదు.. కానీ డెవలప్ లో బ్రిటన్ తో సమానం..
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ ఎప్పుడో అన్నాడు.. కానీ నేడు ప్రతి దేశంలో జనాభా విపరీతంగా పెరిగింది.
By: Tupaki Desk | 21 Oct 2025 3:00 PM ISTదేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ ఎప్పుడో అన్నాడు.. కానీ నేడు ప్రతి దేశంలో జనాభా విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశమంటే.. మనుషులు కాదు.. ఆ దేశంలో ఉన్న సుఖ సంతోషాల గురించి చెప్తున్నారు. ఏ దేశంలోనైతే సంతోషంగా ప్రజలు ఉంటారో.. ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. సొంత కరెన్సీ లేకపోయినా కూడా ఈ దేశం అభివృద్ధి అనే పథంలో ప్రపంచంతో పోటీ పడుతుంది. ఇంతకీ ఆ దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో కొన్ని దేశాలు పెద్దవైనా వెనుకబడిపోయాయి.. మరికొన్ని చిన్నవైనా ముందంజలో ఉన్నాయి. అలాంటి అద్భుత ఉదాహరణే లిక్టెన్‌స్టైన్. ఈ దేశం గురించి వింటే మొదట ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దీనికి సొంత కరెన్సీ లేదు.. సొంత భాష లేదు.. అతెందుకు అది ప్రత్యేక దేశమైనా ఒక్క విమానాశ్రయం కూడా లేదు. అయినా ఇది ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటి. ఆర్థికంగా బ్రిటన్‌కంటే ముందు వరుసలో ఉంది.
అతిచిన్న దేశం లిక్టెన్‌స్టైన్
స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల మధ్యలో చిన్న పర్వత ప్రాంతంలో ఉన్న లిక్టెన్‌స్టైన్ దేశం పరిమాణం కేవలం 160 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఈ దేశ రాజధాని ‘వాడుజ్’. ఇది పరిమిత ప్రజాస్వామ్య దేశం. దేశంలోని మొత్తం జనాభా సుమారు 30 వేలు మాత్రమే. ఇప్పటికీ చాలా మందికి ఈ దేశం గురించి తెలిసే ఉండదు. కానీ దాన్ని ఒకసారి గూగుల్‌లో చూసినా, ‘ఇది నిజంగానే ఉందా?’ అనిపిస్తుంది.
జర్మన్ లాంగ్వేజ్ ప్రధానం..
సొంత భాషలేని ఇక్కడి ప్రజలు ఒకరినొకరు మాట్లాడుకునేందుకు సమీంపలోని జర్మన్ భాషనే వాడుతారు. విమానాశ్రయం లేకపోవడంతో, దగ్గర్లోని స్విట్జర్లాండ్ లేదంటే ఆస్ట్రియా నుంచే లిక్టెన్‌స్టైన్‌కి వెళ్లాలి. ఇక్కడ సొంత కరెన్సీ లేదు. స్విట్జర్లాండ్ ఫ్రాంక్‌నే ఇక్కడి దేశస్తులు ఉపయోగిస్తారు. అయినప్పటికీ, ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, సురక్షితమైన దేశాల్లో ఒకటి.
జీవితం ప్రశాంతత..
ఇక్కడి ప్రజలకు జీవితం అంటే పోటీ కాదు.. ప్రశాంతత. ఎక్కువ మందికి జీవితాంతం పని చేయకపోయినా సుఖంగా ఉండేంత ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. ప్రభుత్వం విధించే పన్నులు చాలా తక్కువ. అందుకే ఇక్కడి ప్రజలు తమ అభిరుచులకు అనుగుణంగా వ్యాపారాలు, హాబీలు కొనసాగిస్తూ సంతోషంగా జీవిస్తుంటారు. పర్యాటకం, ఐటీ, మిషనరీ తయారీ రంగాలు లిక్టెన్‌స్టైన్ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది.
ఇక్కడి ప్రజల జీవన విధానం కూడా సింపుల్ గా ఉంటుంది. ధనం ఉన్నా వారిలో దర్పం కనిపించదు. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. నిశ్శబ్దంగా జీవిస్తారు. నేరాలు అరుదుగా జరుగుతాయి. మొత్తం దేశంలోని జైలులో కేవలం ఏడుగురు ఖైదీలు మాత్రమే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. దేశానికి సంబంధించి భద్రతా బాధ్యతలను చూసేది కేవలం 100 మంది పోలీసులు మాత్రమే.
రాత్రి ఇళ్లకు తాళాలు వేయని దేశస్తులు..
ఇక్కడ ప్రజలు రాత్రి ఇంటికి తాళం వేయకుండానే నిద్రపోతారు. ఇది ఆశ్చర్యానికి గురి చేసే అంశమనే చెప్పాలి. ఈ దేశం ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. ‘దేశం పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, అది శాంతియుతంగా ఉండాలి.’ లిక్టెన్‌స్టైన్ మనకు నేర్పేది చాలా సులభమైన విషయం. అభివృద్ధి అంటే ఎత్తయిన భవనాలు కాదు.. అది మనుషుల మధ్య ఉన్న విశ్వాసం. ఇక్కడ ప్రజలు సంపదను చూపించడానికి కాదు, పంచుకోవడానికి ఉపయోగిస్తారు.
చిన్న దేశం, పెద్ద మనసు, అపారమైన శాంతి. ఈ మూడు పదాలు లిక్టెన్‌స్టైన్‌ను అర్థం చేయడానికి సరిగ్గా సరిపోతాయి. భూమ్మీద స్వర్గం ఎక్కడ ఉందని ఎవరైనా అడిగితే, జవాబు ఠక్కున చెప్పవచ్చు.. స్విట్జర్లాండ్ పక్కనే చిన్నగా ఉన్న లిక్టెన్‌స్టైన్ అనే దేశం అనవచ్చు.
