ఎల్.ఐ.సి. జీవన్ కిరణ్... ఈ ప్లాన్ ప్రత్యేకత ఇదే!
సాధారణంగా టర్మ్ పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం జరగదు
By: Tupaki Desk | 28 July 2023 10:26 AM GMTసాధారణంగా టర్మ్ పాలసీల్లో ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇవ్వడం జరగదు. పాలసీ సమయంలో బీమా హామీ ఇవ్వడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో ప్రీమియం సొమ్మును వాపస్ చేసే ఒక కొత్త పథకాన్ని ఎల్.ఐ.సీ ప్రవేశపెట్టింది. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం...!
అవును... ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్.ఐ.సీ కొత్త టర్మ్ పాలసీని లాంచ్ చేసింది. జీవన్ కిరణ్ (ప్లాన్ 870) పేరిట దీన్ని తీసుకొచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ సేవింగ్స్ అండ్ లైఫ్ ఇన్సురెన్స్ ప్లాన్. ఇందులో భాగంగా మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు.
ఈ జీవన్ కిరణ్ ప్లాన్ కొనుగోలుకు సంబంధించి కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించారు. ఇదే సమయంలో మెచ్యూరిటీకి కనీస వయసు 28 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 80 ఏళ్లుగా ఉంది. అదేవిధంగా... 10 ఏళ్లు నుంచి 40 ఏళ్ల పాలసీ టర్మ్ తో ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.
కనీసం 15 లక్షల బీమా హామీతో ఈ పాలసీని కొనుగోలు చేయొచ్చని.. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితీ లేదని ఎల్.ఐ.సీ తెలిపింది. కనీస ప్రీమియం మొత్తం రూ.3 వేలు కాగా.. సింగిల్ ప్రీమియం అయితే రూ.30 వేలుగా నిర్ణయించారు. ఏడాదికి ఒకసారి లేదా ఆరు నెలలకోసారి ప్రీమియం మొత్తాన్ని చెల్లించొచ్చు.
ఈ జీవన్ కిరణ్ టర్మ్ బీమా ప్లాన్ లో పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ అనంతరం ప్రీమియం మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ టర్మ్ ప్రారంభమయ్యాక కవరేజీ సమయంలో పాలసీదారుడు మరణిస్తే.. హామీ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఏకమొత్తంతో లేదా ఐదేళ్ల పాటు విడతల వారీగా చెల్లిస్తారు.
అయితే... దీనికి సంబంధించి కొన్ని కీలక కండిషన్స్ ఉన్నాయి. వీటిలో గృహిణులు, గర్భిణులను జీవన్ కిరణ్ ప్లాన్ తీసుకోవడానికి మినహాయించారు. డెలివరీ అయిన ఆరు నెలల తర్వాత మాత్రమే స్త్రీలు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. ఇదే సమయంలో కొవిడ్ కు సంబంధించిన వ్యాక్సినేషన్లు పూర్తి చేసుకోకుంటే కొన్ని షరతులు వర్తిస్తాయి.
మరిన్ని వివరాలకు, షరతులకు ఇక్కడ క్లిక్ చేయండి!