వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు షాక్.. హైదరాబాద్ లో ఆస్తుల వేలం!
వైసీపీ మహిళా నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక చిక్కుల్లో పడ్డారు. ఆమె ఆస్తులు వేలం వేయనున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ((LICHFL) ప్రకటించింది.
By: Tupaki Desk | 21 Feb 2026 5:11 PM ISTవైసీపీ మహిళా నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుక చిక్కుల్లో పడ్డారు. ఆమె ఆస్తులు వేలం వేయనున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ((LICHFL) ప్రకటించింది. 2018లో తీసుకున్న రూ.340 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు గాను బుట్టా గ్రూప్ ష్యూరిటీగా చూపించిన ఆస్తులను వేలం వేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జారీ చేసిన ఈ ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చకు దారితీసింది. రాజకీయ, వ్యాపార వర్గాలలో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ కేంద్రంగా బుట్టా గ్రూప్ అనేక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోందని చెబుతున్నారు. మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివ ఆధ్వర్యంలో బుట్టా గ్రూప్ సంస్థలు నడుస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రముఖ మెరిడియన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వీరి యాజమాన్యంలోనే ఉన్నాయి. అదేవిధంగా మాదాపూర్‌లోని ప్రసిద్ధ బుట్టా కన్వెన్షన్ సెంటర్, పించోడ్ హోటల్స్ కూడా బుట్టా గ్రూపులో భాగమేనని చెబుతున్నారు. తేజస్వి మోటార్స్ పేరుతో వాహనాల డీలర్‌షిప్ కూడా నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిటైల్, హెల్త్‌కేర్, ఆభరణాల వ్యాపారాల్లో కూడా బుట్టా రేణుక దంపతులు భాగస్వాములుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
2018లో బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా ఉండగా, వ్యాపార అవసరాల కోసం బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం రూ.340 కోట్ల రుణాన్ని తీసుకున్నారని ఎల్ఐసీ హౌసింగ్ తెలిపింది. మొదట్లో వాయిదాలు సక్రమంగా చెల్లించినా, ఆ తర్వాత ఈఎంఐలు ఎగవేయడంతో బకాయి రూ.782 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. రుణ చెల్లింపులపై నోటీసులు పంపినా, ఇరువర్గాల మధ్య ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరకపోవడంతో గ్యారెంటీగా చూపిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
బుట్టా రేణుక సంస్థలకు చెందిన ఆస్తులు వేలం వేయనున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ ప్రకటన ప్రకారం హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని సర్వే నెంబరు 1009, ఫేజ్-6లోని 3,833 చదరపు గజాల స్థలాన్ని వేలం వేసేందుకు నోటీసులు జారీ చేసింది. ఈ స్థలంలో బుట్టా గ్రూపునకు చెందిన మెరిడియన్ స్కూల్ నడుస్తోంది. ఈ భవనాలతో కలిపి వేలం వేయనున్నట్లు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ బెంగళూరు బ్రాంచి అధికారులు శుక్రవారం ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటనలో తెలియజేసిన ఆస్తుల విలువ రూ.65 కోట్లుగా నిర్ణయించారు. ఈ ఏడాది మార్చి 23 వరకు ఈ బిడ్ ఫాం దాఖలు చేసేందుకు గడువు విధించింది. మార్చి 24న ఈ-వేలం వేస్తామని ఆ ప్రకటనలో తెలియజేశారు.
