Begin typing your search above and press return to search.

7 అడుగుల అల.. 20 వేల ప్రాణాలు.. పావు వంతు ఊరు నాశనం

తూర్పు ఆఫ్రికాలోని లిబియాలో ఇటీవలి జల ప్రళయం ఎంతటి విధ్వంసం రేపిందో అందరూ చూస్తునూ ఉన్నారు

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:19 AM GMT
7 అడుగుల అల.. 20 వేల ప్రాణాలు.. పావు వంతు ఊరు నాశనం
X

తూర్పు ఆఫ్రికాలోని లిబియాలో ఇటీవలి జల ప్రళయం ఎంతటి విధ్వంసం రేపిందో అందరూ చూస్తునూ ఉన్నారు. మొదట వంద మంది లోపే చనిపోయారనుకుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇంకా ఎందరు ప్రాణాలు కోల్పోయారో లెక్కేలేదు. గత వారం సముద్రంలోకి కొట్టుకెళ్లిన శవాలు ఇప్పటికీ తీరానికి కొట్టుకొస్తున్నాయంటేనే పరిస్థితి ఎంత భీతావహంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లిబియాలోని తీర నగరం డేర్నా ఇప్పుడో శవాల దిబ్బ అంటే తప్పేం లేదు. అసలీ నగరం పావు వంతు భాగం కొట్టుకుపోయింది.

అందరూ నిద్రలో ఉండగా..

డేర్నాలో గత వారం జల ప్రళయం సంభవించినప్పుడు ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. అంటే ఏ తెల్లవారుజామునో వారిని విపత్తు ముంచేసింది. ఇక ఆ నగరంపై పడిన అల కూడా మామూలుది కాదు. 23 అడుగుల ఎత్తయిన అల అని చెబుతున్నారు. 23 అడుగులు అంటే.. దాదాపు రెండంతస్తుల భవనం అంత. ఒక ఉప్పెనలాగా మీదపడిన ఆ అలకు ఊరిలో పావు వుంతు కొట్టుకుపోయింది. జనం గాఢ నిద్రంలో ఉండడంతో ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకపోయారు. నిద్రలోనే సముద్రంలోకి కొట్టుకుపోయారు. వారంతా ప్రాణాలు కోల్పోవడంతో సముద్రంలో మృతదేహాలు చెల్లాచెదురుగా తేలియాడుతున్నాయి.

మహా విషాదం ఆలస్యంగా బయటకు..

లిబియాలో వరదలు తొలుత సోమవారం బయటకు వచ్చాయి. అప్పటివరకు మిగతా ప్రపంచానికి అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే లిబియా ఇప్పుడు రెండు ముక్కలుగా ఉంది. ఇక డేర్నాలో రాకాసి అల 20,000 మంది ప్రాణాలను తీసిన విషయాన్ని అంతర్జాతీయ రెడ్‌ క్రాస్‌ కమిటీ (ఐసీఆర్‌సీ) నిపుణులు వెల్లడించారు. కాగా, ఈ అల ఎత్తు దాదాపు 7 మీటర్లు ఉందని పేర్కొన్నారు. మరికొన్ని పల్లపు ప్రాంతాల్లో ఈ అల ఎత్తు దాదాపు ఆరు అంతస్తుల భవనం అంతకు చేరుకొంది. కమ్మేసిన బురద నీరు.. పెద్ద పెద్ద భవనాలను కుప్పకూల్చి ప్రజలను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లింది.

ఘటన జరిగింది ఎప్పుడు?

డేర్నా జల ప్రళయం సెప్టెంబరు 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. అసలు దీనికి కారణం.. రెండు డ్యామ్ లు బద్దలు కావడం. ఈ దెబ్బకు అల పర్వత కనుమలను దాటి ఊరిపై పడింది. కాగా, డేర్నాలో దాదాపు లక్ష మంది జనాభా ఉన్నారు. ఈ నగరంలో 1942 నుంచి ఐదు భారీ వరదలు వచ్చాయి. చివరిసారిగా 2011లో వరద ముంచెత్తింది. ఇప్పటివరకు 11 వేల మంది శవాలు దొరికాయి. 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. డేర్నా నగరం కోలుకోవాలంటే కొన్నేళ్లు పడుతుంది. వరదలకు బద్దలైన డ్యామ్‌లను 1973, 1977లో యుగోస్లేవియా కంపెనీ నిర్మించింది. డెర్నాలోని డ్యామ్‌ 75 మీటర్ల ఎత్తుతో 18 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. రెండో డ్యామ్‌ మన్సోర్‌ ఎత్తు 45 మీటర్లు. దీని సామర్థ్యం 1.5 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు.

లిబియా అంటే గడాఫీ..

లిబియా అంటే ఇప్పుడిలా ఉంది కానీ.. దానిని నియంతలా దశాబ్దాలపాటు పాలించాడు కల్నల్ గడాఫీ. పేరుకు నియంత అయినా.. ఆయనది సంక్షేమ రాజ్యంగా చెబుతారు. విద్య, వైద్యం అన్నిటిలోనూ గడాఫీ తనదైన ముద్ర చూపారు. అలాంటి గడాఫీ పశ్చిమ దేశాలకు కంటగింపయ్యాడు. 2011లో అతడిని నాటో కూటమి దళాలు హతమార్చాయి. తర్వాత లిబియా అంతర్గత యుద్ధం బారినపడింది. ఇప్పుడు ఆ దేశం రెండు ముక్కలు. పశ్చిమాన రాజధాని ట్రిపోలీ కేంద్రంగా పాలన సాగిస్తున్న నేషనల్ యూనిటీ ప్రభుత్వాన్ని మిగతా ప్రపంచం గుర్తించింది. తూర్పు ప్రాంతం నేషనల్ ఆర్మీ ఏలుబడిలో ఉంది. దీనికి ఫ్రాన్స్ మద్దతు బలంగా ఉంది.