Begin typing your search above and press return to search.

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన దిగ్గజ నేత కాంగ్రెస్ లోకి....?

అలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Nov 2023 4:21 PM GMT
చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన దిగ్గజ నేత కాంగ్రెస్ లోకి....?
X

కాంగ్రెస్ లోకి వలసలు పెరుగుతున్నాయి. జాతీయ నాయకత్వం పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టి పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఐక్యతను సాధిస్తూంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీలో ఉన్న నేతలకు గేలం వేయడం మొదలెట్టారు. అలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి లాంటి వారు కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు.

ఇపుడు మరో దిగ్గజ నేత మీద కాంగ్రెస్ కన్ను పడింది. ఆయనే టి దేవేందర్ గౌడ్. 1987లో రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా టీడీపీ తరఫున గెలిచి అలా రాజకీయ్ అరంగేట్రం చేసిన దేవేందర్ గౌడ్ తరువాత కాలంలో అమాంతం ఎదిగిపోయారు. ఆయన 1994లో టీడీపీ ప్రభుత్వం ఎంటీయార్ నాయకత్వంలో వచ్చినపుడు మంత్రి అయిపోయారు.

చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న ఈ తెలంగాణా బీసీ నేత 1995 నుంచి 2004 దాకా బాబు తరువాత అంతటి నేతగా ఉమ్మడి ఏపీలోనూ టీడీపీలోనూ చక్రం తిప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి మరణం తరువాత హోం శాఖను చంద్రబాబు దేవేందర్ గౌడ్ కి అప్పగిస్తే ఆయన దాన్ని కడు సమర్ధంగా నిర్వహించారు.

ఇక 2008 ప్రాంతంలో ఆయన నవ తెలంగాణా పార్టీ ప్రారంభించారు. అయితే ఆ తరువాత దాన్ని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత తిరిగి తెలుగుదేశంలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా కొన్నాళ్ళు వ్యవహరించారు. ఆయన ప్రస్తుతం టీడీపీలో ఉన్నా అంత చురుకుగా లేరు.

ఇదిలా ఉంటే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ బీజేపీలో ఉన్నారు. ఈ తండ్రీ కొడుకులు ఇద్దరినీ కాంగ్రెస్ లో చేరమని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈ మేరకు మంతనాలు కూడా జారిపింది. నేరుగా దేవేందర్ గౌడ్ ఇంటికి ఎల్బీ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మధు యాష్కీ వెళ్లి కలిశారు. రేవంత్ రెడ్డి సైతం దేవేందర్ గౌడ్ ని కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

దానికి దేవేందర్ గౌడ్ నుంచి సుముఖత వ్యక్తం అయింది అని అంటున్నారు. ఆయన తొందరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు అని అంటున్నారు. ప్రముఖ బీసీ నేతగా ఒకనాడు చక్రం తిప్పిన దేవేందర్ గౌడ్ కి ఇది నిజంగా థర్డ్ ఇన్నింగ్స్ అవుతుంది అని అంటున్నారు. బీసీలకు ప్రాముఖ్యత ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. దాంతో దేవేందర్ గౌడ్ లాంటి సీనియర్ నేతలకు మంచి అవకాశాలే ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ బీజేపీలలో ఉన్న కీలక నేతలను తమ వైపునకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతోంది అని అంటున్నారు.