లియాండర్ పేస్ ఎంట్రీతో బీజేపీ ఫలితాలు మారనున్నాయా? టెన్నిస్ దిగ్గజ ఎంట్రీతో బెంగాల్ అతలాకుతలం..
టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు
By: Tupaki Political Desk | 31 March 2026 2:31 PM ISTటెన్నిస్ కోర్టులో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి తప్పుకున్న తర్వాత ఆయన గమ్యం ఎటు అనే సస్పెన్స్‌కు తెరదించుతూ భారతీయ జనతా పార్టీ వైపు కదిలాడు. లియాండర్ నిర్ణయం క్రీడా, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న పేస్, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఏ విధంగా ప్లస్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. లియాండర్ పేస్ రాజకీయ ప్రవేశం, ఎన్నికలపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందంటే..
ఢిల్లీలో చేరిక!
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో లియాండర్ పేస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఒక ఒలింపిక్ పతక విజేత, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారుడు తమ పార్టీలోకి రావడం ఎన్నికల వేల బీజేపీకి పెద్ద ఊపునిస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే కిరణ్ రిజిజు, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి క్రీడా నేపథ్యం ఉన్న వారు బీజేపీలో నేతలుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో బీజేపీ క్రీడా కారుల పార్టీగా కూడా గుర్తింపు సంపాదించుకుంటుంది.
ఐదు రాష్ట్రాల్లో జోరు!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పేస్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించనున్నారు. క్రీడల పట్ల మక్కువ ఉన్న యువతను, ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడానికి పేస్ చరిష్మా ఉపయోగపడుతుందని బీజేపీ వ్యూహం. మైదానంలో తన పోరాట పటిమతో భారతీయుల మనసు గెలుచుకున్న లియాండర్ పేస్, ఇప్పుడు బీజేపీ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
అభ్యర్థిగానా..? లేక స్టార్ క్యాంపెయినరా?
లియాండర్ పేస్ కేవలం ప్రచారానికే పరిమితమవుతారా? లేదంటే స్వయంగా ఎన్నికల బరిలోకి దిగుతారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఆయనను ఏదైనా కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎమ్సీ లో చేరినప్పటికీ, అక్కడ ఆశించిన స్థాయిలో క్రియాశీలకంగా ఉండలేకపోయారు. ఇప్పుడు బీజేపీలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.
టెన్నిస్ కోర్టులో ఎన్నో అసాధ్యమైన విజయాలను సుసాధ్యం చేసిన లియాండర్ పేస్, ఇప్పుడు రాజకీయాల్లో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. టీఎమ్సీలో దక్కని సంతృప్తిని బీజేపీలో పొందుతారా..? లేదా ప్రచారానికే పరిమితం అవుతారా..? అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా, ఒక క్రీడా దిగ్గజం ప్రజా సేవలోకి రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఆయన రాకతో బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ మేరకు లాభపడుతుందో చూడాలి.
