Begin typing your search above and press return to search.

కవితపై మహిళా నేతల ఆగ్రహం అందుకేనా?

ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కవితపై విమర్శనాస్త్రాలు సంధించారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:05 AM GMT
కవితపై మహిళా నేతల ఆగ్రహం అందుకేనా?
X

ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు.. తాము పాటించడానికి కాదన్నట్టు ఉంది.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీరు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకు గానూ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఇందులో మహిళలకు దక్కింది కేవలం ఏడు మాత్రమే.

ఇంకోవైపేమో.. కేసీఆర్‌ ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కవిత మాత్రం దేశంలో పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఢిల్లీ వేదికగా జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు, ధర్నాలు కూడా నిర్వహించారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఎన్‌ ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను విచారిస్తుండటంతో.. దాన్ని పక్కదారి పట్టించడానికే మహిళా రిజర్వేషన్‌ అంటూ లేని ఉద్యమాన్ని రేపారనే ఆరోపణలు అప్పుడే వచ్చాయి.

ఇప్పుడు కేసీఆర్‌ తెలంగాణలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడం.. అందులో ఏడుగురు మహిళలకు మాత్రమే సీట్లు లభించడంతో కవితపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఢిల్లీకి వెళ్లి ధర్నాలు చేయడం కాదని.. ముందు నీ తండ్రి కేసీఆర్‌ ను 33 శాతం సీట్లు కావాలని అడిగాలంటూ ఎద్దేవా చేస్తున్నాయి.

ఈ క్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. కవితపై విమర్శనాస్త్రాలు సంధించారు.

33 శాతం రిజర్వేషన్‌ కోసం పోరాడుతున్నట్టు బిల్డప్‌ ఇస్తూ మోదీ సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారని, ఇంట్లో తండ్రికి చెప్పడానికి మాత్రం ధైర్యం చాలట్లేదా అని కవితను టార్గెట్‌ చేస్తున్నారు. అందులోనూ కేసీఆర్‌ తన మొదటి కేబినెట్‌లో మహిళలకు అసలు చోటే కల్పించని సంగతి తెలిసిందే. ఇక రెండో విడత కేబినెట్‌ లో విమర్శలకు జడిసి ఇద్దరికి చోటు కల్పించారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌ వేదికగా కవితపై విమర్శలు చేశారు. "33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? ఆకాశం,అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా? కవితమ్మ "Be the change you want to see ". ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి" అని షర్మిల ఫైరయ్యారు.

"తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్‌ లోనూ ప్రాధాన్యత దక్కలే. లిక్కర్‌ బిజినెస్, రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్‌ లో, పెద్దల సభలో, నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్‌ ఇప్పించు. లిక్కర్‌ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే.. 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి?" అని షర్మిల ట్విట్టర్‌ లో కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు.

"రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్‌ లో పెట్టి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. . నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి" అని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

అదేవిధంగా బీజేపీ మహిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ కూడా కవితపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో దొంగ దీక్ష చేసిన కవిత రాష్ట్రంలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదని తన తండ్రి కేసీఆర్‌ ని ఎందుకు అడగట్లేదని ప్రశ్నించారు. లిక్కర్‌ కేసు దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వని తన తండ్రిని ప్రశ్నించకపోగా, మళ్లీ విపక్షాలను కవిత నిలదీయడం ఆశ్చర్యం కలిగిస్తోందని దుయ్యబట్టారు.