Begin typing your search above and press return to search.

చోటా నేతలు.. కార్యకర్తలు లెక్క లేకుండా పోయారా?

ఎంపీ కావొచ్చు. ఎమ్మెల్యే కావొచ్చు. ఆఖరికి ఒక గ్రామ సర్పంచ్ కావొచ్చు. నాయకుడు ఎవరైనా కావొచ్చు

By:  Tupaki Desk   |   18 March 2024 3:56 AM GMT
చోటా నేతలు.. కార్యకర్తలు లెక్క లేకుండా పోయారా?
X

ఎంపీ కావొచ్చు. ఎమ్మెల్యే కావొచ్చు. ఆఖరికి ఒక గ్రామ సర్పంచ్ కావొచ్చు. నాయకుడు ఎవరైనా కావొచ్చు. అతడ్ని నాయకుడ్ని చేసేది నలుగురు జనాలే. వారే లేకుంటే ఆ నాయకుడ్ని ఎవరు పట్టించుకుంటారు. అందుకే.. నేత ఎవరైనా సరే తనను తాను సరిగా చూసుకున్నా లేకున్నా.. తన చుట్టూ ఉన్న వారి కష్టం గురించి.. వారి సమస్యల గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఇంటిని పట్టించుకున్నా లేకున్నా తన చుట్టూ ఉండే ఛోటా నేతలు.. కార్యకర్తల కష్ట సుఖాల గురించి అదే పనిగా పరామర్శిస్తుంటారు. అయితే.. ఇదంతా గతం. వర్తమానం చాలానే మారింది.

ఎన్నికల్లో గెలుపు మీదనే ఫోకస్.. విలువలు.. సిద్ధాంతాల్ని పట్టించుకోకుండా అధికారం ఎటు ఉంటే అటు వైపు మాత్రమే మొగ్గు చూపే దరిద్రపుగొట్టు రోజులు వచ్చేశాయి. ఒకవేళ అధికారంలో ఉన్న వారి గూటికి చేరకుంటే జరిగే నష్టమే తప్పించి.. నమ్మిన సిద్దాంతం కోసం నిలబడాలనన తాపత్రయం లేకుండా పోతోంది. గతంలో అధికారం చేజారినా.. ఎన్నికల్లో ఓడినా వచ్చే ఎన్నికల్లో కాదంటే ఆ తర్వాత మళ్లీ వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేసి.. కాదన్న జనం మెప్పు పొంది ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటేవారు.

ఇప్పుడు అలాంటిదేమీ లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం డబ్బును వెదజల్లటం.. ఎన్నికల నాటికి అవసరమైన వారిని తమ దగ్గరకు తెచ్చుకోవటానికి.. వారి సేవల్ని సొంతం చేసుకోవటానికి ఎంతకైనా.. దేనికైనా సై అన్నట్లుగా వ్యవహరించే ధోరణి తప్పించి ఇంకేమీ పట్టట్లేదు. ఇదే నేతలకు.. వారిని అభిమానించి.. ఆరాధించే ఫాలోయర్లకు మధ్య దూరాన్ని పెంచుతోంది. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ రంజిత్ రెడ్డి.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగేసి హస్తం గూటికి చేరిపోయారు.

వీరి చేరిక ముందు గతంలో మాదిరి తమకు అండగా నిలిచే ఛోటా నేతలు.. కార్యకర్తలతో మాట్లాడటం.. పరిస్థితుల్ని వివరించటం.. వారిని ఒప్పించటం.. తనతో పాటు కలిసి నడవాలంటూ అభ్యర్థించటం లాంటివి ఏమీ లేకుండా పోయాయి. తమకు తాము నిర్ణయం తీసుకోవటం.. మరెవరితోనూ షేర్ చేయకపోవటం.. గుట్టుచప్పుడు కాకుండా అధికార పార్టీలోకి చేరిపోయిన వైనం.. ఈ ఇద్దరు నేతల్ని ఫాలో అయ్యేటోళ్లు.. కార్యకర్తలు కోపంతో ఉన్నారు.

ఎంత డబ్బులు.. పలుకుబడి ఉంటే మాత్రం.. తమ దన్ను అన్నది లేకుంటే వారెలా నాయకులు అవుతారన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ తీరుపై కొందరు నేతలు పిచ్చ లైట్ తీసుకుంటున్నారు. తమను ఫాలో అయ్యే వారి ఆగ్రహాం పాల పొంగు లాంటిదని.. వారిని కూల్ చేయటం ఎలానో తెలుసంటున్న నేతల ధీమా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేతల చాణుక్యానికి ఛోటా నేతలు.. కార్యకర్తలు రానున్న రోజుల్లో ఎలాంటి తీరును ప్రదర్శిస్తారన్న దానికి అనుగుణంగానే వారికి దక్కే గౌరవ మర్యాదలు ఉంటాయని మాత్రం చెప్పక తప్పదు.