Begin typing your search above and press return to search.

బీజేపీకి నెక్ట్స్ గుడ్ బై చెప్ప‌బోయే ముఖ్య నేత ఈయ‌నే

దీంతో శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పంచాయతీ నెలకొంది. అయితే, ఈ స్థానం జ‌న‌సేన‌కు ఇవ్వొద్దని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Nov 2023 2:18 AM GMT
బీజేపీకి నెక్ట్స్ గుడ్ బై చెప్ప‌బోయే ముఖ్య నేత ఈయ‌నే
X

ఓ వైపు నామినేష‌న్ల గ‌డువు స‌మీపిస్తుంటే సరిగ్గా ఈ స‌మ‌యంలో తెలంగాణ‌లో బీజేపీకి దిమ్మ‌తిరిగే షాక్‌లు త‌గులుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ వివేక వెంకటస్వామి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో.. బీజేపీకి గట్టి షాక్‌ తగిలినట్టు అయ్యింది. అయితే, ఈ ఒర‌వ‌డి ఆ పార్టీలో ఇంకా కొన‌సాగేలా క‌నిపిస్తోంది. ఇంకో ముఖ్య నేత ఆ పార్టీని వీడ‌నున్న‌ట్లు చెప్తున్నారు. ఆయ‌నే కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి.

కీల‌క‌మైన ఎన్నికల వేళ బీజేపీకి త్వ‌ర‌లో షాక్ ఇవ్వ‌బోయేది కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి అనే ప్ర‌చారం జ‌ర‌గ‌డం వెనుక ఆస‌క్తిక‌ర కార‌ణాలు ఉన్నాయి. బీజేపీ, జనసేన పార్టీల పొత్తు , జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో బీజేపీ నాయకుల నుంచి చాలా అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి సీటును జనసేన పార్టీకి కేటాయించనున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన, బీజేపీ మధ్య పంచాయతీ నెలకొంది. అయితే, ఈ స్థానం జ‌న‌సేన‌కు ఇవ్వొద్దని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూడా చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఓట్లలో 30 శాతం ఓట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవాలంటే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఓట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా కీలకం.

బీజేపీ తరపున ఆ పార్టీ నేత‌ రవి యాదవ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రవి యాదవ్ కే శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వాలంటూ తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్య నేతలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. జనసేనకు శేరిలింగంపల్లి టికెట్ కేటాయించవద్దని కోరుతున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి శేరిలింగంపల్లి, తాండూరు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.