Begin typing your search above and press return to search.

గత ఏడాది కంటే ఈ ఏడాదిలోనే ఉద్వాసనలు ఎక్కువ.. సర్వే షాక్

తాజాగా వెలుగు చూసిన ఒక సర్వే రిపోర్టు ఇప్పుడు షాకిచ్చేలా మారింది.

By:  Tupaki Desk   |   20 July 2023 4:49 AM GMT
గత ఏడాది కంటే ఈ ఏడాదిలోనే ఉద్వాసనలు ఎక్కువ.. సర్వే షాక్
X

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాంద్యం పరిస్థితులతో పాటు.. టెకీ సంస్థల లాభాల మీద చూపుతున్న ప్రభావం.. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఉద్యోగుల మీదకు వస్తున్నాయి. దీంతో.. పొదుపు చర్యలు.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వేటు వేసే దిశగా ఐటీ కంపెనీలు వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా వెలుగు చూసిన ఒక సర్వే రిపోర్టు ఇప్పుడు షాకిచ్చేలా మారింది.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లేఆఫ్స్ ఎక్కువగా ఉన్న విషయాన్ని వెల్లడిస్తూ సర్వే రిపోర్టు వెల్లడైంది. ఈ పరిస్థితి మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ట్రెండ్ నడుస్తుందన్న విషయాన్ని తాజా నివేదిక పేర్కొంది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో (జనవరి - జూన్) మధ్యలో 2, 13,020 మంది టెకీలకు ఉద్యోగాలు పోయినట్లుగా పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి సంఖ్య గత ఏడాదితో పోలిస్తే పెద్దదిగా ఉండటం కనిపిస్తుంది.

గత ఏడాది 45,166 మంది ఉద్యోగులు తమ కొలువుల్ని కోల్పోతే.. ఈ ఆర్నెల్లలో అంతకు ఐదు రెట్లు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోయినట్లుగా పేర్కొంది నివేదిక. ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీల్లో అమెజాన్.. మైక్రోసాఫ్ట్.. గూగుల్.. యాహు.. మెటా.. జూమ్ లాంటి ప్రముఖ కంపెనీలు ఉండటం గమనార్హం. ప్రపంచం విషయాన్ని పక్కన పెట్టేద్దాం. మన సంగతి ఏంటి బాసూ అనడిగితే.. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లు (జనవరి -జూన్) 10,774 మంది టెకీలను తొలగించినట్లుగా లేఆఫ్స్.ఎఫ్ వైఐ నివేదిక స్పష్టం చేసింది.

తొలి ఆర్నెల్లలో ఉద్యోగాలు కోల్పోయిన వారిలో టెకీలే అధికమని చెబుతున్నారు. టెకీల తొలగింపులో భారత్ లో బెంగళూరు మహానగరం ముందుంటే.. మన హైదరాబాద్ లో మాత్రం అలాంటి పరిస్థితి తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో కీలక అంశం ఏమంటే.. ఆ మధ్యలో ఒక వెలుగు వెలిగిన స్టార్టప్ కంపెనీల ప్రభ తగ్గుతోంది. గడిచిన ఆరేడు నెలల్లో దేశంలోని 107 స్టార్టప్ ల్లో 28,046 మంది ఉద్యోగులకు లేఆఫ్ సెగ తగిలినట్లుగా చెబుతున్నారు. ప్రపంచ పరిస్థితుల్ని చూస్తే.. ఇప్పుడున్న మాంద్యం పరిస్థితులు ఈ ఏడాది చివరి వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. అప్పటివరకు ఉద్యోగులు కాసింత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.