చక్రం తిప్పుతున్న ఎంపీ లావు.. టీడీపీలోకి మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
తెలుగుదేశం పార్టీలో చేరిన నుంచి ఎంపీ లావు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనను బాగా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.
By: Tupaki Desk | 23 Jun 2025 5:00 AM ISTగుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీని ఖాళీ చేయించేలా వ్యూహం రచిస్తున్నారు నరసారావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి రెండోసారి ఎంపీగా గెలిచిన లావు.. గతంలో తనకు సన్నిహితంగా మెలిగిన వారిని టీడీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే జంగా కృష్ణమూర్తి, మర్రి రాజశేఖర్, మక్కిన మల్లికార్జునరావును వైసీపీ నుంచి టీడీపీలోకి తెచ్చారు ఎంపీ లావు. జంగా, మక్కెన ఎన్నికలకు ముందే వైసీపీని వీడగా, కొద్ది నెలల క్రితం మర్రిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావుపై లావు ఫోకస్ పెట్టారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన నుంచి ఎంపీ లావు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఆయనను బాగా ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. దీంతో అధిష్టానం వద్ద తన పరపతిని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో వైసీపీని టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీలో తాను ఉండగా సన్నిహితంగా మెలిగిన నేతలు అందరినీ క్రమంగా టీడీపీలోకి తెచ్చేలా ఎంపీ పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.
2014లో తొలిసారి నరసారావుపేట పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన శ్రీకృష్ణదేవరాయులు అప్పటి సీఎం జగన్ తో మంచి సంబంధాలే ఉండేవని చెప్పేవారు. కానీ, అప్పటి మంత్రి విడదల రజినితోపాటు కొందరు వైసీపీ నేతలతో ఎంపీకి పొసిగేది కాదని ప్రచారం ఉంది. దీంతో వైసీపీలో లావు ప్రత్యేక వర్గం ఏర్పాటు చేసుకున్నారని చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో జగన్ తో తెగతెంపులు చేసుకున్న లావు వైసీపీలో తన వర్గాన్ని టీడీపీలోకి తెచ్చారు. అయితే కొందరు టికెట్ దక్కదనే ఆలోచనతో అప్పట్లో వైసీపీలోనే ఉండిపోగా, ప్రస్తుతం వారు కూడా టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.
మరోవైపు వైసీపీలో కమ్మ సామాజికవర్గం నేతలు ఉండకూడదా? అంటూ ఈ మధ్య పల్నాడు పర్యటనలో మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా గతంలో తనకు ఎదురైన అవమానాలు మళ్లీ కమ్మ సామాజికవర్గం నేతలకు ఎదురుకాకూడదన్నట్లు ఎంపీ భావిస్తున్నారని, వైసీపీలో కమ్మ సామాజికవర్గ నేతలు అందరితో చర్చించి, తాను అండగా ఉంటానని వైసీపీని వీడి రావాలని పిలుపునిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ ప్రయత్నాలను టీడీపీలో సిట్టింగు ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శంకరరావు పార్టీలోకి వస్తే తన సంగతి ఏంటని సిట్టింగ్ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఎంపీ లావు ఎత్తుగడులు ఆసక్తికరంగా మారాయని అంటున్నారు.
