ఇల్లు ఖాళీ చేసి రాజ్ తరుణ్, శేఖర్ బాషాలపై లావణ్య సంచలన ఆరోపణలు
ఎట్టకేలకు నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తన ఇల్లును ఖాళీ చేశారు. గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్-లావణ్య కలిసి ఈ ఇల్లు కొన్నట్టు ఆమె ఇటీవల ఆరోపించింది.
By: Tupaki Desk | 21 April 2025 10:02 AM ISTఎట్టకేలకు నటుడు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తన ఇల్లును ఖాళీ చేశారు. గతంలో ప్రేమికులుగా ఉన్నప్పుడు రాజ్ తరుణ్-లావణ్య కలిసి ఈ ఇల్లు కొన్నట్టు ఆమె ఇటీవల ఆరోపించింది. ఓ మంత్రి నుంచి రూ.55 లక్షలు అప్పు చేసి కొన్నామని.. అప్ప చెల్లించకపోవడంతోనే ఆయనకు ఈ ఇంటిని అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రాణభయంతో బతుకుతున్నానని తెలిపారు. ప్రముఖ నటుడు రాజ్ తరుణ్, ఆయన స్నేహితుడు శేఖర్ బాషా తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నటి లావణ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉందని తెలిపిన లావణ్య, ఇటీవల తనపై కొంతమంది దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం కూడా నలుగురు మహిళలు తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, గంటలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. "ప్రతి నిమిషం ప్రాణభయంతో బతుకుతున్నా. నా ప్రాణం పోయాక వారిని పట్టుకుంటారా?" అని ఆమె ప్రశ్నించారు.
సుమారు నాలుగేళ్ల క్రితం తనకు తెలిసిన ఒక వ్యక్తి నుంచి రాజ్ తరుణ్‌తో కలిసి రూ. 55 లక్షలు అప్పు తీసుకున్నట్లు లావణ్య తెలిపారు. గత రెండేళ్లుగా గొడవల కారణంగా వడ్డీ చెల్లించడం ఆగిపోయిందని, దీంతో అప్పు ఇచ్చిన వారు ఇటీవల ఫోన్ చేసి డబ్బు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో ఇల్లు స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని చెప్పారు. ఇందుకు వారం రోజుల గడువు కూడా ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ రాజ్ తరుణ్ రూ. 55 లక్షలు చెల్లించినప్పటికీ, ఆ ఆస్తిని అతడికి అప్పగించవద్దని తాను కోర్టును కోరతానని, అందులో తన వాటా ఉందని లావణ్య స్పష్టం చేశారు.
ఇంత జరుగుతున్నా రాజ్ తరుణ్ తనతో మాట్లాడటం లేదని, తనను ఇబ్బంది పెట్టాలని, తన పరువుకు భంగం కలిగించాలని, చివరికి చంపేయాలని రాజ్ తరుణ్, శేఖర్ బాషా ప్రయత్నిస్తున్నారని లావణ్య తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వివాదంలో ఆస్తి వివాదంతో పాటు, గతంలో రాజ్ తరుణ్ తో తనకున్న సంబంధం.. ఇతర వ్యక్తిగత అంశాలు కూడా ముడిపడి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా ఈ వివాదంలోకి వచ్చారని, ఇంటి విషయంలో వారికి, లావణ్యకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు, శేఖర్ బాషా కూడా లావణ్యపై కొన్ని ఆరోపణలు చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే లావణ్య ఆరోపణలపై రాజ్ తరుణ్, శేఖర్ బాషా నుండి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ఈ కేసు విచారణ కోర్టులో ఉన్నందున, న్యాయస్థానం తీర్పుతోనే ఈ వివాదానికి తెరపడే అవకాశం ఉంది. లావణ్య చేసిన ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి.
