ఒళ్లు జలదరించేలా.. కొవిడ్ టెర్రర్ గుర్తుకు తెచ్చే నాటి ఆడియా!
వైద్యుడ్ని కనిపించే దైవంగా భావిస్తారు. మనిషి ప్రాణం విలువ వైద్యుడికి తెలిసినంతగా మరెవరికీ తెలీదంటారు. అలాంటి వైద్యుడు.. మరో వైద్యుడితో మాట్లాడుతూ.. బెడ్ ఖాళీ లేదా.. అయితే ఆ పేషెంట్ ను చంపేయ్ అనేంత దుర్మార్గమా? అన్న షాక్ ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది.
By: Tupaki Desk | 30 May 2025 10:30 AM ISTవైద్యుడ్ని కనిపించే దైవంగా భావిస్తారు. మనిషి ప్రాణం విలువ వైద్యుడికి తెలిసినంతగా మరెవరికీ తెలీదంటారు. అలాంటి వైద్యుడు.. మరో వైద్యుడితో మాట్లాడుతూ.. బెడ్ ఖాళీ లేదా.. అయితే ఆ పేషెంట్ ను చంపేయ్ అనేంత దుర్మార్గమా? అన్న షాక్ ఇప్పుడు పలువురి నోట వినిపిస్తోంది. దీనికి కారణం కొవిడ్ వేళ ఒక ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఇద్దరు వైద్యుల మధ్య సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్ అంటూ ఒకటి లీక్ కావటం సంచలనంగా మారింది. 2021 నాటి ఆడియో క్లిప్ ఇది నిజామా ఫేక్ అన్నది తెలియదు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.
కొవిడ్ మహమ్మారి తీవ్రత దారుణ స్థితిలో ఉన్నప్పుడు బెడ్లు లేక.. పేషెంట్లు విలవిలలాడిన సందర్భంలో మాట్లాడుకున్న వైద్యుల ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అప్పటి పరిస్థితిని మరోసారి గుర్తు చేయటమే కాదు.. కొవిడ్ మరణాల వేళ వైద్యులు ఇంత నిర్దరయగా వ్యవహరించారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. మహారాష్ట్రలోని లాతూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూసినప్పుడు మానవత్వాన్ని కొవిడ్ ఎంతలా చంపేసిందో ఇట్టే అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..
లాతూర్ కు చెందిన కౌసర్ ఫాతిమా అనే మహిల కొవిడ్ బారిన పడ్డారు.ఆమె భర్త దయామీ అజీమొద్దీన్ గౌసుద్దీన్ ఆమెను 2021 ఏప్రిల్ 15న ఉద్గిర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. అక్కడ చేర్పించారు. అక్కడ పేషెంట్లకు డాక్టర్ శశికాంత్ డాంగే వైద్యం చేశారు. ఆ ఆసుపత్రిలో ఆమె పది రోజులు చికిత్స చేయించుకొని డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. ఆమెకు చికిత్స జరుగుతున్న ఏడో రోజున.. ఆమె భర్త దయామీ డాక్టర్ శశికాంత్ డాంగే వద్ద ఉన్న వేళలో.. సదరు వైద్యుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
సీనియర్ సర్జన్ డాక్టర్ శశికాంత్ దేశ్ పాండే నుంచి ఫోన్ రావటం.. ఆ సమయంలో డాక్టర్ డాంగే భోజనం చేస్తున్నారు. దీంతో ఆయన స్పీకర్ పెట్టి కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కొవిడ్ పేషెంట్లతో బెడ్లు సరిపోవటం లేదని.. కొత్త వాళ్లకు బెడ్ అవసరం ఉందన్న విషయాన్ని కోరటంతో.. సీరియస్ గా ఉన్న వారిలో ఒకరైన కౌసర్ ఫాతిమాను ఉద్దేశించి.. ‘ఆ పేషెంట్ ను చంపేయ్. బెడ్ ఖాళీ అవుతుంది’ అన్న మాటను గౌసుద్దీన్ అస్పష్టంగా విన్నారు. దీనికి సంబంధించి డాక్టర్ డాంగే బదులిస్తూ.. అప్పటికే ఆక్సిజన్ సపోర్టు తగ్గించినట్లుగా సమాధానం ఇచ్చినట్లుగా వెలుగు చూసింది.
దీనికి సంబంధించిన ఆడియోక్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్పటి వ్యాఖ్యలు తనను ఎంతగానో కలిచివేశాయని.. ఆ వ్యాఖ్యలు మళ్లీ విని తానెంతో బాధ పడ్డట్లుగా పేర్కొంటూ గౌసుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న ఆడియోలో ఉన్న స్వరం డాక్టర్ దేశపాండేదేనా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ డాక్టర్ మీద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో బయటకు వచ్చే అంశం మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
