Begin typing your search above and press return to search.

పశువులకూ వారాంతపు సెలవులు..

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో పశువుల పాత్ర ఎంతో కీలకం. పంట పొలాల్లో కష్టపడి పని చేసే ఈ మూగజీవాలకు మనుషుల్లాగే విశ్రాంతి అవసరమని లతేహర్ రైతులు బాగా అర్థం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   14 Aug 2025 11:44 AM IST
పశువులకూ వారాంతపు సెలవులు..
X

వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో పశువుల పాత్ర ఎంతో కీలకం. పంట పొలాల్లో కష్టపడి పని చేసే ఈ మూగజీవాలకు మనుషుల్లాగే విశ్రాంతి అవసరమని లతేహర్ రైతులు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే వారంలో ఒక రోజు వాటిని పనిలో దింపకుండా సెలవు ఇచ్చే ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అంతేకాదు, సంవత్సరానికి ఒకసారి వాటి కోసం వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఇక్కడి రైతులు పాటించే సంప్రదాయం కార్మిక హక్కులను ఉల్లంఘించే వారికి గట్టి సందేశంగా నిలుస్తోంది.

మతం, కులం తేడా లేకుండా పశువులపై రైతులు చూపుతున్న ఈ ప్రేమ అనుబంధం తరతరాలుగా కొనసాగుతోంది. హిందువులు గురువారం, ఆదివారం రోజుల్లో, క్రైస్తవులు ఆదివారం, ముస్లింలు శుక్రవారం పశువులకు విశ్రాంతి ఇస్తారు. “మనుషుల్లాగే ఆరు రోజులు పని చేసిన తర్వాత పశువులకు కూడా విశ్రాంతి హక్కే. అవి కూడా ప్రాణాలతో ఉన్న జీవాలే” అని అక్కడి రైతులు చెబుతున్నారు.

ప్రతి వారం ఒక రోజు పశువులకు సెలవు ఇవ్వడం ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రయోజనకరమని పశువైద్య నిపుణులు చెబుతున్నారు.మూగ జీవాలకు విశ్రాంతినిస్తే అవి మరింత ఉత్సాహంగా పని చేస్తాయని పేర్కొంటున్నారు. వాటిలో ఉన్న చిన్నపాటి వ్యాధులు ఉన్నా నయమవుతాయంటున్నారు.

దీపావళి తర్వాత రెండో రోజున ‘గాయ్ దంద్’ పేరుతో పశువుల వినోద వేడుకలు నిర్వహించడం మరో ప్రత్యేకత. ఉదయం స్నానం చేయించి పూజలు చేసి, ప్రత్యేక ఆహారం తినిపించిన తర్వాత సాయంత్రం గ్రామంలోని పశువుల యజమానులు ఒకేచోట చేరతారు. అక్కడ పందిని వదిలేస్తారు. పందిని చూసిన పశువులు దాని వెంట పరిగెత్తుతూ ఉత్సాహంగా సమయం గడుపుతాయి.

20కి పైగా గ్రామాల్లో ఈ సంప్రదాయం

పశువులకు ఒక రోజు సెలవు ఇచ్చే సంప్రదాయం జార్ఖండ్‌లోని లతేహర్ జిల్లాలో ఉన్నది. ఈ జిల్లాలోని దాదాపు 20 గ్రామాల రైతులు దాదాపు శతాబ్దానికి పైగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారాల్లో ఎడ్లు, ఇతర పశువులను పనుల్లోకి దింపరు. పశువులకు ఆదివారం పూర్తిగా విశ్రాంతి ఇవ్వడం ఇక్కడి రైతుల ఆనవాయితీ. లతేహర్ జిల్లాలోని హర్ఖా, మోంగర్, పరార్, లాల్‌ఘాడీతో పాటు 20 గ్రామాల రైతులు తమ పశువులతో ఆదివారం పని చేయించరు. ఆ రోజు పూర్తిగా పశువులకు కావాల్సినంత మేత, పచ్చ గడ్డి వేస్తారు.

100 ఏళ్లుగా పాటిస్తున్న సంప్రదాయం

పశువులకు విశ్రాంతి ఇచ్చే సంప్రదాయాన్ని తమ పూర్వీకుల నుంచి పాటిస్తున్నామని, దాదాపు వందేళ్లకు పైగా కొనసాగుతున్నదని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఆదివారం పశువులకు సెలవు ఇచ్చే సంప్రదాయాన్ని తమ పూర్వీకులు రూపొందించారని.. తాము కొనసాగిస్తున్నామని ఇక్కడి పశుపోషకులు చెబుతున్నారు. మనుషుల్లాగే పశువులకు కూడా విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. రోజూ పనిచేసే పశువులకు అలసట ఉంటుందని పేర్కొంటున్నారు.

అందుకే సెలవట

వందేళ్ల క్రితం పొలంలో దున్నుతున్నప్పుడు ఓ ఎద్దు చనిపోయిందని,ఆ ఎద్దు పని భారంతో అలసిపోయిందని అప్పటి రైతులు గుర్తించారు. దీంతో గ్రామస్తులంతా కలిసి వారంలో ఒక రోజు పశువులకు విశ్రాంతి ఇవ్వాలని మూకుమ్మడిగా నిర్ణయించారు. అప్పటి నుంచి ఆదివారాల్లో పశువులకు సెలవు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూ వస్తున్నది.