Begin typing your search above and press return to search.

ఇలా చేస్తే వీసాలు, గ్రీన్ కార్డులు రద్దు.. అమెరికాలో కొత్త హెచ్చరిక

బుధవారం నాడు అమెరికా సిటిజన్ షిప్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ హెచ్చరికను పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   27 Jun 2025 10:43 AM IST
ఇలా చేస్తే వీసాలు, గ్రీన్ కార్డులు రద్దు.. అమెరికాలో కొత్త హెచ్చరిక
X

అమెరికాలో నివసిస్తున్న వీసాదారులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అమెరికా ప్రభుత్వ సంస్థ యుఎస్‌సీఐఎస్‌ (USCIS) తాజాగా ఓ కీలక హెచ్చరిక జారీ చేసింది. దేశ భద్రతకు ముప్పుగా మారే కార్యకలాపాల్లో పాల్గొంటే వీసాలు, గ్రీన్ కార్డులు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. తీవ్ర నేరాల్లో పట్టుబడిన వారికి మినహాయింపు ఉండదని, వారి స్థిర నివాస హక్కులు రద్దు అవుతాయని తెలిపింది.

-నేరచర్యలకు పాల్పడితే మినహాయింపు లేదు

బుధవారం నాడు అమెరికా సిటిజన్ షిప్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ హెచ్చరికను పోస్ట్ చేసింది. "గ్రీన్ కార్డ్ లేదా వీసా ఉన్న విదేశీ పౌరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే, వీసా లేదా గ్రీన్ కార్డ్ రద్దు చేయబడుతుంది" అనే సందేశాన్ని గ్రాఫిక్ రూపంలో పంచుకుంది.విదేశీయులు అల్లర్లకు ప్రోత్సాహం ఇవ్వడం, తీవ్రవాద చర్యలను సమర్థించడం లేదా ఇతరులను అలాంటి చర్యల వైపు ప్రేరేపించడం వంటివి ఎంతమాత్రం సహించబడవని USCIS స్పష్టం చేసింది. "అమెరికాలో వీసా లేదా గ్రీన్ కార్డ్‌తో జీవించడం ఒక హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అధికారం (ప్రివిలేజ్)" అని USCIS నొక్కి చెప్పింది. "ఇక్కడి చట్టాలు..విలువలను గౌరవించాల్సిన బాధ్యత విదేశీయుల మీద ఉంటుంది" అని పేర్కొంది.

- గ్రీన్ కార్డు అంటే ఏమిటి?

గ్రీన్ కార్డు అనేది ఒక వ్యక్తికి లా ఫుల్ పర్మినెంట్ రెసిడెంట్ హోదాను కల్పిస్తుంది. ఇది పొందిన తర్వాత వారు అమెరికాలో శాశ్వతంగా నివసించగలుగుతారు. అలాగే ఉద్యోగం చేసేందుకు కూడా అర్హత పొందుతారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ప్రకారం, గ్రీన్ కార్డు పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కుటుంబ సభ్యుల ద్వారా స్పాన్సర్‌షిప్ ద్వారా పొందొచ్చు. ఇక నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. శరణార్థ లేదా ఆశ్రయ దారులుగా అర్హత పొందొచ్చు. మానవతా ప్రాతిపదికలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా పొందొచ్చు. ప్రస్తుతం అమెరికాలో సుమారు 1.28 కోట్ల మంది గ్రీన్ కార్డు హోల్డర్లు ఉన్నారు.

- ట్రంప్ పాలనలో కఠిన వలస విధానాలు

ఈ తాజా హెచ్చరిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో చేపట్టిన వలస నియంత్రణ చర్యలతో ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది. 2025 నుంచి వచ్చే నాలుగేళ్లలో దాదాపు $150 బిలియన్లు (రూ. 12 లక్షల కోట్లకు పైగా) డిపోర్టేషన్ చర్యలపై ఖర్చు చేయాలని ట్రంప్ ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా.. కొత్త డిటెన్షన్ కేంద్రాల ఏర్పాటు.. సదరన్ బోర్డర్ వాల్ నిర్మాణం కొనసాగింపు.. వేలాది కొత్త ఇమ్మిగ్రేషన్ అధికారుల నియామకం చేర్చబడ్డాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం దాదాపు $10 బిలియన్ల వరకు ఐసీఈ (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్) కు కేటాయించబడుతోంది. ఐసీఈ అనేది అమెరికాలో వలస నియంత్రణకు ప్రధాన సంస్థగా పనిచేస్తుంది.

అమెరికాలో నివసించే విదేశీయులందరూ చట్టాలకు కట్టుబడి ఉండాలని USCIS స్పష్టం చేసింది. వీసా, గ్రీన్ కార్డ్ పొందినవారు అమెరికా సమాజానికి మేలు చేసేవారు కావాలని, తమ హక్కులను వినియోగించుకునేటప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలన్నది తాజా హెచ్చరిక ద్వారా వెల్లడైంది.