Begin typing your search above and press return to search.

అన్న గారు గుర్తుకొస్తున్నారు...!

By:  Tupaki Desk   |   10 Sep 2023 6:26 PM GMT
అన్న గారు గుర్తుకొస్తున్నారు...!
X

చంద్రబాబు అరెస్ట్ అయిన వేళ ఆయనను రిమాండ్ విధించిన వేళ అన్న గారు గుర్తుకు వస్తున్నారు. ఎన్టీయార్ ఎక్కడ ఉన్నా శివతాండవం చేస్తారు అని డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇక ఎన్టీయార్ సతీమణి లక్ష్మీ పార్వతి అయితే చంద్రబాబు పాపం పండింది అని ఒక హాట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. బాబుకు కోర్టు రిమాండ్ అంటే చాలా సంతోషించతగిన విషయం అని ఆమె అన్నారు.

తాను సోమవారం ఎన్టీయార్ ఘాట్ కి వెళ్లి ఆయనకు నివాళి అర్పిస్తాను అని ఆమె చెప్పడం విశేషం. చంద్రబాబు అవినీతిపరుడని ఎన్టీయార్ ఎపుడో చెప్పారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్టీయార్ పార్టీని లాక్కున్నారని, అలాగే ఆయన ప్రజల నుంచి గెలుచుకున్న ముఖ్యమంత్రి పదవిని కూడా లాక్కున్నారని లక్ష్మీపార్వతి అన్నారు.

అందుకే బాబు పాపం పండి ఈ రోజు జైలుకు వెళ్లారని ఆమె అంటున్నారు. మరో వైపు చూస్తే ఎన్టీయార్ వీరభక్తుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీయార్ ఆత్మ శాంతించే రోజు ఈ రోజు అన్నారు. బాబుకు రిమాండ్ అంటే పెద్దాయన ఎక్కడ ఉన్నా ఆనందిస్తారని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్టీయార్ విగ్రహాలు ఈ రోజు ఆనందభాష్పాలతో తొణికిసలాడుతున్నాయని అన్నారు. బాబు అవినీతిని బయటపెట్టి ఆయనను జైలుకు పంపించిన జగన్ ఎన్టీయార్ అభిమానులకు నిజమైన అన్న గారి భక్తులకు ఆనందం కలిగించారని కొడాలి చెప్పడం విశేషం. మొత్తానికి బాబు అరెస్ట్ నుంచి రిమాండ్ వరకూ సాగిన కధలో అంతా అన్న గారిని తలచుకుంటున్నారు.

ఇటీవలే ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలను టీడీపీ బాబు నాయకత్వాన నిర్వహించింది. అదే విధంగా ఎన్టీయార్ వెండి నాణెం ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో జరిగితే చంద్రబాబు ఆయన అల్లుడి హోదాలో ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

మరి పెద్దాయన ఆశీస్సులు బాబుకు లేవా అన్నదే చర్చగా ఉంది. ఉంటే కనుక బాబుకు ఏమిటీ కష్టాలు అని మరో వైపు చర్చ సాగుతోంది. బాబు వయసు ఇపుడు డెబ్బయి నాలుగు. అదే ఏజ్ లో ఎన్టీయార్ పదవి లాక్కుని ఆయన్ని మానసికంగా హింసించి మరణానికి కారణం అయ్యారని కొడాలి అన్నారు. అందుకే బాబు ఇపుడు జైలుకు పోతున్నారని దేవుడు న్యాయం చేశారని కూడా చెప్పుకొచ్చారు. సో అన్న గారు ఇపుడు అందరికీ బాగా గుర్తుకు వస్తున్నారు. మరీ ముఖ్యంగా నిజమైన ఎన్టీయార్ ఫ్యాన్స్ కి ఎక్కువగా గుర్తుకు వస్తున్నారు అంటున్నారు.