Begin typing your search above and press return to search.

ఒక్క వారంలో రూ.4 లక్షల కోట్ల నష్టం.. కుబేరుడి సంపద కరిగిపోయిందిలా..

ప్రపంచ టెక్నాలజీ రంగంలోనే కాదు.. గ్లోబల్ బిలియనీర్ల జాబితాలోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఓరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ కు స్టాక్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది.

By:  A.N.Kumar   |   10 Jun 2026 11:51 PM IST
ఒక్క వారంలో రూ.4 లక్షల కోట్ల నష్టం.. కుబేరుడి  సంపద కరిగిపోయిందిలా..
X

ప్రపంచ టెక్నాలజీ రంగంలోనే కాదు.. గ్లోబల్ బిలియనీర్ల జాబితాలోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఓరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ కు స్టాక్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. మార్కెట్‌లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల కారణంగా కేవలం ఒక్క వారంలోనే ఆయన వ్యక్తిగత సంపద దాదాపు 47 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 4 లక్షల కోట్లు) ఆవిరైపోయింది. ఒకే వారంలో ఇంత భారీ స్థాయిలో సంపద కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేవలం ఏడు రోజుల్లో 16 శాతం పతనం

బ్లూమ్‌బెర్గ్ , ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. జూన్ 2 నాటికి ల్యారీ ఎల్లిసన్ నికర ఆస్తి విలువ 296 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఓరాకిల్ షేర్లలో వచ్చిన సునామీ కారణంగా అది వేగంగా క్షీణించి ప్రస్తుతం 249.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంటే కేవలం ఏడు రోజుల వ్యవధిలోనే ఆయన తన మొత్తం సంపదలో దాదాపు 16 శాతం కోల్పోయారు. ఈ ఆకస్మిక పతనంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్న ఎల్లిసన్.. తాజా రేటింగ్‌ల ప్రకారం ఐదో స్థానానికి పడిపోయినట్లు సమాచారం.

ఓరాకిల్ షేర్లలో ఎందుకీ అమ్మకాల ఒత్తిడి?

ల్యారీ ఎల్లిసన్ సంపదలో మెజారిటీ భాగం ఓరాకిల్ కార్పొరేషన్ షేర్ల రూపంలోనే ఉంది. జూన్ 9న ఒక్కరోజే ఈ కంపెనీ షేరు ధర సుమారు 4 శాతం పడిపోగా వారం మొత్తం మీద చూసుకుంటే ఏకంగా 17 శాతం మేర క్షీణించింది. ఈ భారీ పతనానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. భారీ అప్పులపై ఇన్వెస్టర్ల ఆందోళన చెందారు. ఓరాకిల్ సంస్థ తన వ్యాపార విస్తరణ కోసం భారీ స్థాయిలో అప్పులు సేకరించడంపై మార్కెట్ వర్గాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఇది కంపెనీ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందేమోనని ఇన్వెస్టర్లు భావించారు. రెండోది టెక్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. గత కొన్ని నెలలుగా కృత్రిమ మేధస్సు , క్లౌడ్ టెక్నాలజీ పుణ్యమా అని టెక్ షేర్లు విపరీతంగా పెరిగాయి. అయితే ఇటీవల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఓరాకిల్ షేర్ల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి.

ఏఐ వ్యూహాలపై సందేహాలు

ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో దూసుకుపోవడానికి ఓరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేలా మౌలిక సదుపాయాలను విస్తరిస్తోంది. అయితే ఈ విస్తరణ కోసం సంస్థ అనుసరిస్తున్న ఆర్థిక వ్యూహాలు.. అధిక వ్యయాలపై మార్కెట్ విశ్లేషకులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రభావమే ఇప్పుడు షేర్ల పతనానికి దారితీసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా సంపద కోల్పోవడం కుబేరులకు కొత్తేమీ కాకపోయినప్పటికీ ల్యారీ ఎల్లిసన్ విషయంలో జరిగిన నష్టం మాత్రం అత్యంత అరుదైనదిగా రికార్డుల్లోకెక్కింది. అయినప్పటికీ ఇప్పటికీ ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల వరుసలోనే కొనసాగుతున్నారు.