Begin typing your search above and press return to search.

జగన్ టోన్ తో రాహుల్...అమిత్ షా కు సవాల్ !

అయితే ఇపుడు జాతీయ స్థాయిలో అలాంటిదే జరుగుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా సాగుతున్న ఈ భాషా సమరంలో అమిత్ షాతో రాహల్ ఢీ కొడుతున్నారు.

By:  Tupaki Desk   |   21 Jun 2025 9:30 AM IST
జగన్ టోన్ తో రాహుల్...అమిత్ షా కు సవాల్ !
X

పేద విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవద్దా వారికి ఆంగ్ల భాషను దూరం చేస్తారా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన మాటలు వింటూంటే వెనకటికి ఎక్కడో విన్నట్లుగా అనిపించడంలేదూ. అవును ఏపీలో జగన్ సీఎం గా ఉండగా ఇలాగే మాట్లాడేవారు. ఆంగ్ల భాష మీద వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా ఒక భాషా యుద్ధం జరిగింది.

అయితే ఇపుడు జాతీయ స్థాయిలో అలాంటిదే జరుగుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా సాగుతున్న ఈ భాషా సమరంలో అమిత్ షాతో రాహల్ ఢీ కొడుతున్నారు. పేదలకు ఆంగ్ల భాషను దూరం చేసేవిగా బీజేపీ ఆరెస్సెస్ విధానాలు ఉంటున్నాయని ఆయన ద్వజమెత్తారు.

ప్రప్రంచంతోనే ఈ రోజున పోటీ ఉందని, అందువల్ల ఆంగ్ల భాష రాకుంటే ఎలా అని అమిత్ షాని నిలదీశారు ఇంతకీ అమిత్ షా అన్నదేమిటి అంటే తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత దేశంలో ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని వ్యాఖ్యానించారు. భారత దేశాన్ని, సంస్కృతిని, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏ పరాయి భాషా సరిపోదని ఆయా అన్నారు. అంతే కాదు విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమని ఆయన అన్నారు.

అమిత్ షా అన్నది దేశీయ భాషలలోనే భారత్ ఆత్మ ఉందని ఆ భాషలు నేర్చుకున్నపుడే అది అర్ధమవుతుందని. అయితే ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ చాలా ఘాటుగానే స్పందించారు. దేశంలోని ప్రతి భాషకు దాని సొంత ఆత్మ, సంస్కృతి, జ్ఞాన సంపద ఉన్నాయని రాహుల్ అన్నారు. అలా వాటన్నింటినీ మనం గౌరవించాలని ఆయన అంటూనే అదే సమయంలో ప్రపంచంతో సమర్థవంతంగా పోటీ పడేందుకు వీలుగా ఆంగ్ల విద్యను కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అపుడే భారత విద్యార్ధులు అంతర్జాతీయ వేదికల మీద రాణిస్తారు అని అన్నారు.

అంతే కాదు ఆయన ఈ సందర్భంగా బీజేపీ ఆరెస్సెస్ ల మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలు ఎదగాలని మంచి సమాజం రావాలని అంతటా సమానత్వం ఉండాలని వారు భావించడం లేదని అన్నారు. ఆంగ్లాన్ని ఉన్నత విద్యను పేదలకు దూరం చేయాలని ఆరెస్సెస్ బీజేపీ ఆలోచిస్తున్నాయని రాహుల్ విమర్శించారు.

అంతే కాదు ఈ దేశంలో మాతృభాషకు ఎంత ప్రాధాన్యత ఉందో అంతే విధంగా ప్రస్తుత ప్రపంచంలో రాణించడానికి ఆంగ్లానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అంతా గుర్తెరగాలని ఆయన కోరారు. అందువల్ల ప్రతి విద్యార్థికి మాతృభాషతో పాటు ఆంగ్లంలో కూడా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెబుతున్నారు.

ఇక ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గు పడాల్సిన విషయం కాదని అది సాధికారికతకు మంచి గుర్తు అన్నారు. పేదలు కూడా సమాజంలో తలెత్తుకునేలా ఆంగ్ల భాష వారికి ధీమా ఇస్తుందని అన్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుపడే విషయం కాదని బీజేపీ పెద్దలు అర్ధం చేసుకోవాలని అన్నారు. మొత్తాని బీజేపీ కాంగ్రెస్ ల మధ్య రాజుకున్న భాషా యుద్ధం ఏ కీలక మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.