Begin typing your search above and press return to search.

చంద్రయాన్ - 3 లో మనుషులు... లాలూ కూడా బీకాం లో ఫిజిక్సే!

అవగాహన లేనప్పుడు మౌనంగా ఉంటే బెటర్ అనే ఆలోచన వారికి రాకపోవడం గమనార్హం. ఇందులో భాగంగా తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇలానే స్పందించారు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 3:30 PM GMT
చంద్రయాన్ - 3 లో మనుషులు... లాలూ కూడా బీకాం లో ఫిజిక్సే!
X

ఇస్రో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన చంద్రయాన్ - 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాబిల్లిపై రోవర్ తనపని తాను చేసుకుంటూ పోతుంది. ఇదే సమయంలో ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశమూ సాధించిన జాబిల్లి దక్షిణ దృవంపై ల్యాండింగ్ ను ఇస్రో సాధించిందని ప్రశంసలు అందుతున్నాయి.

ఈ స్థాయిలో చంద్రయాన్ - 3 గురించి ప్రపంచం మొత్తం ప్రశంసల జల్లులు కురుస్తుంటే... మరోపక్క అసలు ఈ చంద్రయాన్ - 3 ఏమిటి.. అది జాబిల్లిపైకి ఎలా వెళ్లింది.. ఎందుకు వెళ్లింది.. ఇది మానవ రహిత ప్రయాణమా.. మానవ సహిత ప్రయాణమా అనే బేసిక్ ఐడియా కూడా పెద్ద పెద్ద నాయకులు అని చెప్పుకునేవారికి లేకుండా పోతుంది!

అవును... చంద్రయాన్ - 3 లో మనుషులు చంద్రుడిపైకి వెళ్లారని.. వారంతా అక్కడ తెగ కష్టపడిపోతున్నారని.. అవిరామంగా అధ్యయానాలు చేసేస్తున్నారని చెబుతున్నారు. అవగాహన లేనప్పుడు మౌనంగా ఉంటే బెటర్ అనే ఆలోచన వారికి రాకపోవడం గమనార్హం. ఇందులో భాగంగా తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ఇలానే స్పందించారు.

తాజాగా మైకుల ముందుకు వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్... "చంద్రయాన్ - 3లో మనుషులు చంద్రుడిపైకి వెళ్లారు. వారు చంద్రుడిపై తిరుగుతూ అధ్యయనాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తల కష్టం వల్లే మన దేశానికి మంచి పేరు వచ్చింది" అని ఇండియా కూటమి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

దీంతో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్ - 3 లో మానవులు వెళ్లలేదనే విషయం మాజీ ముఖ్యమంత్రికి తెలియదా అని నెటిజన్లు ఆడుకుంటున్నారు.

కాగా... వారం రోజుల క్రితం ఇదే విషయంపై రాజస్థాన్ క్రీడల మంత్రి అశోక్ చంద్న ఇదేస్థాయిలో అవిజ్ఞాన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. చంద్రయాన్ - 3 సక్సెస్ పై స్పందించిన ఆయన... చంద్రయాన్ - 3 లో జాబిల్లి పైకి వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ అంటూ వ్యాఖ్యానించారు.

ఇందులో భాగంగా... "చంద్రయాన్ -3 సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. అందులో వెళ్లిన యాత్రికులకు సెల్యూట్ చేస్తున్నా. సైన్స్, స్పేస్ రీసెర్చ్ లో మన దేశం మరింత ముందుకు వెళ్లింది. భారతీయులందరికీ శుభాకాంక్షలు" అని అన్నారు. దీంతో వాయించి వదిలారు నెటిజన్లు. ఇప్పుడు తాజాగా ఆ వాయింపు లాలూ ప్రసాద్ యాదవ్ వైపు మళ్లేలా ఉందని తెలుస్తుంది!