Begin typing your search above and press return to search.

చాన్స్ కొడితే లాలూ ఫ్యామిలీలో అంతా ముఖ్యమంత్రులే !

ప్రజాస్వామ్యం అంటే నిరంతరం మార్పు కోసం ఉన్నదని అర్ధం. ఏ పరిపాలకుడికి అయినా అయిదేళ్ళే ప్రజలు అవకాశం ఇస్తారు.

By:  Tupaki Desk   |   25 Oct 2025 6:00 PM IST
చాన్స్ కొడితే లాలూ ఫ్యామిలీలో అంతా ముఖ్యమంత్రులే !
X

ప్రజాస్వామ్యం అంటే నిరంతరం మార్పు కోసం ఉన్నదని అర్ధం. ఏ పరిపాలకుడికి అయినా అయిదేళ్ళే ప్రజలు అవకాశం ఇస్తారు. అంతే కాదు ఎంత బాగా పాలించినా ఇంకా మంచి పాలకుడి కోసం ప్రజలు అన్వేషిస్తారు. ఆ స్వేచ్చ అధికారం ఓటరుకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. అంతే అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని అంటారు. అదే రాజరిక వ్యవస్థలో అయితే వరసగా కుటుంబాలకు కుటుంబాలు అధికారం అందుకుంటూ కొనసాగుతాయి. అయితే భారతదేశం ప్రజాస్వామ్యంలో కూడా చాలా మంది నాయకులు తమ కుటుంబ వారసులను తెచ్చి అందలాలు ఎక్కించారు. జనాలు కూడా వాటికి ఆమోదించారు.

గాంధీ కుటుంబంలో :

ఈ వారసత్వ రాజకీయాలకు అంకురార్పణ గాంధీ కుటుంబంలోనే మొదలైంది అని చెప్పాలి. పండిట్ నెహ్రూ దేశానికి తొలి ప్రధాని అయ్యారు. ఆయన తరువాత కుమార్తె శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు. ఆ తరువాత మనవడు రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ విధంగా చూస్తే ఒకే కుటుంబంలో మూడు తరాలు దేశానికి నాయకత్వం వహించడం అరుదైన విషయం. ఇక రాహుల్ గాంధీ కూడా ప్రధాని అయితే పండిట్ నెహ్రూ నుంచి నాలుగు తరాలు అత్యున్నత పదవిని అందుకున్నట్లు. ఆ అరుదైన రికార్డు సాధ్యమవుతుందో లేదో తరువాత చూడాలి. అయితే దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులుగా ఉంటూ తమ వారసులను ఆ పదవిలో అధిష్టింప చేశారు.

లాలూ ఫ్యామిలీలో :

ఇక బీహార్ లో లాలూ ఫ్యామిలీలో ఒక అరుదైన ఘటన జరిగింది. 1989లో లాలూ తొలిసారి బీహార్ కి సీఎం అయ్యారు. ఆయన చాలా కాలం పాలించారు. అయితే గడ్డి కుంభకోణం కేసులో ఆయన అరెస్టు కావడంతో తన సతీమణిని సీఎం గా చేసి అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరచారు. ఇది మూడు దశాబ్దాల క్రితం జరిగింది. అలా రబ్రీదేవి సీఎం అయ్యారు. ఆమె ఏమి పాలిస్తారు అనుకునే వారే ఆశ్చర్యపోయేలా భర్త లాలూ కంటే కూడా ఎక్కువ కాలం అంటే దాదాపుగా పదేళ్ళ పాటు పాలించారు. ఇలా భార్యభర్తలు ఇద్దరూ బీహార్ అత్యధిక కాలం పాలించారు.

వారసుడిగా తేజస్వి :

ఇక లాలూ తరువాత ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ ఆర్జేడీకి వారసుడిగా సిద్ధం అయ్యారు. తేజస్వి యాదవ్ తండ్రికి తగ్గ తనయుడిగా రాణిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఇక మిగిలింది ముఖ్యమంత్రి పదవి మాత్రమే. తాజాగా చూస్తే మహా ఘట్ బంధన్ తేజస్వి యాదవ్ ని సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దాంతో ఈ మహా ఘట్ బంధన్ కనుక బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా తేజస్వి యాదవ్ సీఎం అవుతారు.

అరుదైన రికార్డుగా :

ఈ విధంగా కనుక తేజస్వి యాదవ్ సీఎం అయితే మాత్రం ఒక అరుదైన రికార్డు దేశ రాజకీయాల్లో స్థాపించబడుతుంది. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు కుమారుడూ ముగ్గురూ సీఎం గా పనిచేసిన ఘనత కూడా లాలూ కుటుంబానికే దక్కుతుంది. లాలూ ఫ్యామిలీ అంటే ముఖ్యమంత్రుల కుటుంబం అని కూడా సార్ధక నామధేయం స్థిరపడుతుంది. గాంధీల ఫ్యామిలీ అంటే ప్రధానుల కుటుంబం అని ఎలా చెప్పుకుంటారో అలాగే లాలూ ఫ్యామిలీ కొత్త రికార్డుకు రెడీ అవుతోంది అన్న మాట. ఇక్కడ మరో విషయం ఉంది. తేజస్వికి ఒక కుమారుడు ఉన్నారు. అతని పేరు కూడా లాలూ యాదవ్. మరి రానున్న కాలంలో ఆ వారసుడు కూడా రంగంలోకి దిగితే మాత్రం లాలూ సకుటుంబ సపరివార సమేతంగా చీఫ్ మినిస్టర్లు కిందనే లెక్క అని అంటున్నారు. చూడాలి మరి ఈసారి బీహార్ ఎన్నికల్లో ఏ రిజల్ట్ వస్తుందో.