Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ వారసత్వాన్ని అలా తేల్చేసారా...లక్ష్మీ పార్వతి దక్కిందేంటి...?

కానీ లక్ష్మీపార్వతినే మొదటి నుంచి ఎన్టీయార్ ఫ్యామిలీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆమె వల్లనే ఆయన తమకు దూరం అయ్యారని భావించారు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 10:37 AM GMT
ఎన్టీయార్ వారసత్వాన్ని అలా తేల్చేసారా...లక్ష్మీ పార్వతి దక్కిందేంటి...?
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీయార్ దివంగతులై దాదాపుగా మూడు దశాబ్దాలు కావస్తోంది. ఆయన వారసత్వం ఎవరిది అనేది ఎపుడూ చర్చకు వస్తోంది. వారసత్వం అంటే ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఎంటీయార్ సినీ వారసత్వం విషయంలో విభేదాలు లేవు. ఆయన కుమారుడు నందమూరి బాలక్రిష్ణ, మనవడు జూనియర్ ఎన్టీయార్ పంచుకున్నారు. రాజకీయ వారసత్వం విషయంలోనూ ఎక్కడా సమస్య లేదు.

ఎన్టీయార్ ఉండగానే అధికారం ఆయన నుంచి తీసుకుని చిన్నల్లుడు చంద్రబాబు తీసుకున్నారు. ఆ తరువాత ఆయన తన చాణక్యంతో రాజకీయూ అనుభవంతో నిలదొక్కుకున్నారు. మరి వారసత్వం అంటే ఏంటి అంటే ఆయన తరఫున చట్టబద్ధంగా ఎవరు అన్నది. నిజానికి చూస్తే భార్య బతికి ఉంటే ఇమ్మిడియేట్ గా ఆయన వారసురాలు అవుతుంది. అయితే ఎన్టీయార్ మొదటి భార్య ఆయన కంటే ముందే చనిపోయారు

ఇక ఆయన రెండవ పెళ్ళి చేసుకోకుండా ఉంటే కుమారులు కుమార్తెలు ఇలా వారంతా వారసులుగా ఉంటారు. కానీ ఎన్టీయార్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు దాంతో ఆమె చట్టప్రకారం ఆయన వారసురాలు అవుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా ఆమె చట్టప్రకారం వారసురాలు. ఇక ఎన్టీఆర్ ఆమెను బహిరంగంగా వివాహం చేసుకున్నారు. ఆమె వల్లనే తాను ఈ రోజుకు బతికి ఉన్నాను అని కూడా చెప్పుకున్నారు. ఇలా చూసుకున్నపుడు ఎన్టీయార్ వారసుల విషయంలో సమస్య వచ్చి ఉండరాదు.

కానీ లక్ష్మీపార్వతినే మొదటి నుంచి ఎన్టీయార్ ఫ్యామిలీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఆమె వల్లనే ఆయన తమకు దూరం అయ్యారని భావించారు. ఆ విధంగానే ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని 1995లో ఆయన నుంచి తీసుకున్నారు.ఇది చరిత్ర. ఇక ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పనిచేశారు. ఆయనకు ప్రభుత్వం తరఫున పెన్షన్ రావాల్సి ఉంటుంది. ఇది చట్టప్రకారం ఆయన సతీమణి లక్ష్మీపార్వతికి రావాలి.

కానీ ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ తనకు ఎన్టీయార్ పెన్షన్ రాకుండా చేశారు అని వాపోయారు. ఇక ఎంటీయార్ కి భారతరత్న అవార్డు ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. అయితే ఈ అవార్డు ఇస్తే దాన్ని చట్టపరంగా సతీమణి లక్ష్మీపార్వతికే దక్కుతుంది. ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ అవార్డునే వద్దు అనుకున్నారు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అన్న విమర్శలూ ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఎన్టీయార్ వారసత్వ సమస్య దశాబ్దాలుగా ఉంటే దాన్ని కేంద్రంలో బీజేపీ చాలా సులువుగా తీర్చేసింది అని అంటున్నారు. దానికి ఒక కారణం ఉంది. ఎన్టీయార్ పేరుని ఆయన రాజకీయ పలుకుబడిని ఎంతో కొంత తమకు కూడా దక్కాలని తామూ వాడుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. అందుకే ఆయన కుమార్తె కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించింది.

ఇక లేటెస్ట్ గా చూస్తే ఎన్టీయార్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణేన్ని కేంద్రం రూపొందించేందుకు అంగీకరించింది. అలా తయారైన వెండి నాణేన్ని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచారు. ఆయనతో పనిచేసిన వారు సన్నిహితులను కూడా పిలిచారు. అయితే లక్ష్మీ పార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు.

ఆమె దీని మీద ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు. ఇదంతా చేసింది పురంధేశ్వరి అంటూ కారాలూ మిరియాలూ నూరారు. అయితే అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఎన్టీయార్ ఫ్యామిలీ ఏంటో అలా బీజేపీ పెద్దలు పురంధేశ్వరి ద్వారా గుర్తించారు అని అంటున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీకి ఎన్టీయార్ వారసత్వం కావాలి. లక్ష్మీపార్వతి అయితే వేరే పార్టీలో ఉన్నారు. ఇక పురంధేశ్వరిని ముందు పెట్టి బీజేపీ ఎన్టీయార్ లెగసీ కోసం చూస్తోంది అని అంటున్నారు

దాంతో స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా ఎన్టీయార్ వారసత్వ సమస్య కూడా ఇలా తీరింది అని అంటున్నారు. ఎన్టీయార్ పేరిట ఏ అవార్డు ఇచ్చినా ఇపుడు తీసుకునేందుకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్నది ఆయన వెండి నాణెం ఆవిష్కరణ సభ ద్వారా తేటతెల్లమైంది. రేపటి రోజున ఎన్టీయార్ కి భారతరత్న ప్రకటించినా కూడా అది ఫ్యామిలీ మెంబర్స్ కే అందేలా చూస్తారు అన్న మాట. లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ ఫ్యామిలీ మెంబర్ గా కేంద్రంలోని బీజేపీ పట్టించుకోవడం లేదన్నది ఈ సంఘటనతో రుజువు అయింది.

ఇక బీజేపీ ఆలోచనలు తెలిసే వైసీపీ కూడా ఫుల్ సైలెంట్ అయింది అని అంటున్నారు. ఇక లక్ష్మీపార్వతి మాత్రం ఎన్టీయార్ భార్యను అంటూ మీడియా మీటింగ్ పెట్టడంతోనే సరిపుచ్చారు. మొత్తానికి ఎన్టీయార్ కి భారతరత్న ఇపుడు వచ్చినా ఏ ఇబ్బంది ఉండదేమో అంటున్నారు. మొత్తానికి లక్ష్మీపార్వతిని ఎన్టీయార్ ఫ్యామిలీ నుంచి తప్పించేశారు అని అంటున్నారు. మరి లక్ష్మీపార్వతికి ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి అంటే కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.