Begin typing your search above and press return to search.

అల్లుడికి జైలు.. భర్త సమాధికి అత్త నివాళి!

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సతీమణి, ఏపీ తెలుగు - సంస్కృత అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు

By:  Tupaki Desk   |   11 Sep 2023 8:06 AM GMT
అల్లుడికి జైలు.. భర్త సమాధికి అత్త నివాళి!
X

2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

ఈ పరిణామాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు చంద్రబాబు 73 ఏళ్ల వయసులో వెన్నుపోటు పొడిచాడని.. ఇప్పుడు చంద్రబాబు కూడా 73 ఏళ్ల వయసులోనే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని సంతోషపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ సతీమణి, ఏపీ తెలుగు - సంస్కృత అకాడమీ చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఉన్న ఎన్టీఆర్‌ సమాధికి లక్ష్మీపార్వతి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఒక టీవీ చానల్‌ తో మాట్లాడిన లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందా అని నిన్న రాతంత్రా నిద్రపట్టలేదన్నారు. చంద్రబాబుకు రిమాండ్‌ విధించడంతో ఎన్టీఆర్‌ ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్షణం కోసమే తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ వంచకులు తన భర్త చావుకు కారణమయ్యారని మండిపడ్డారు. ఎట్టకేలకు తనకు న్యాయం జరిగిందని భావిస్తున్నానన్నారు.

కాగా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌ పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 1995 జనవరి 18న ఎన్టీఆర్‌ గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ టీడీపీ పేరుతో పార్టీ నడిపిన లక్ష్మీపార్వతి ఆ తర్వాత కొద్ది కాలానికే పార్టీని ఎత్తేశారు. ఆ తర్వాత చాలాకాలం రాజకీయాలకు దూరమైన లక్ష్మీపార్వతి వైసీపీలో చేరారు.

ఇటీవల ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.100 ప్రత్యేక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆమె నేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కు లేఖ రాశారు.

అంతేకాకుండా దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు. ఆమె పతనం చూస్తానని హెచ్చరించారు. ఆమె ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రచారం చేసి ఓడిస్తానని లక్ష్మీపార్వతి సవాల్‌ విసిరారు.