Begin typing your search above and press return to search.

కీలక అంశాన్ని ఎత్తుకున్న మాజీ జేడీ... ఎక్స్ లో చర్చకు తెర!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:59 AM GMT
కీలక అంశాన్ని ఎత్తుకున్న మాజీ జేడీ... ఎక్స్ లో చర్చకు తెర!
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలన్ని ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఒకరు అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉంటే.. మరొకరు పొత్తుల సెట్టింగ్ లో బిజీగా ఉన్నారు.. ఇంకొకరు అసెంబ్లీ గేటు తాకాలని ఆలోచిస్తుంటే.. వేరొకరు కొత్త ఉత్సాహంతో ఉన్నారు.. ఇంకొకరు తమకూ అవకాశం రాకపోద్దా అని చూస్తుంటే.. ఇంకొకరు ఎంతొకొంతమందినైనా ప్రభావితం చేయాలని పరితపిస్తున్నారు. అలా ఎవరి వ్యూహాల్లో, ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... "జై భారత్ నేషనల్ పార్టీ"ని స్థాపించి ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చదువుకున్న యువతను, విద్యావంతులను టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా యువతలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా పలు పలు అంశాలపై చర్చలు పెడుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఒక కీలకమైన పాలసీపై చర్చకు తెరలేపారు!

అవును... గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "నాడు - నేడు" కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మరమ్మత్తులు చేయించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడాన్ని స్వాగతించిన లక్ష్మీనారాయణ... తాజాగా ఒక కీలక అంశంపై ఆన్ లైన్ వేదికగా చర్చ షురూ చేశారు. ఇందులో భాగంగా... "జై భారత్ నేషనల్ పార్టీ.. లిక్కర్ పాలసీ & సంపూర్ణ మద్యపాన నిషేధంపై మీ విలువైన సూచనలను అభ్యర్థిస్తోంది" అని తెలిపారు.

దీంతో ఆ పోస్టుపై స్పందించిన నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా... గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు ఆల్ మోస్ట్ అసాధ్యం అని, అలా చేయడం వల్ల మన రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పక్క రాష్ట్రాలు లాక్కుంటాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మధ్య నిషేధం అమలు చేయాల్సిందేనంటున్నారు.

ఇలా ఆన్ లైన్ వేదికగా నెటిజన్ల అభిప్రాయాలను సేకరించే పనికి పూనుకున్న జేడీ లక్ష్మీనారాయణ.. ఈ విషయంపై తన అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేయలేదు. ఇదే సమయంలో జనం నాడిని బట్టి ఆయా అంశాలపై రీసెర్చ్ చేసి.. వాటిని తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలున్నాయని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.