అడ్లూరి వర్సెస్ హరీష్ రావు.. చర్చకు సై అన్న మంత్రి!
అయితే.. ఈవ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా ఫైర్ అయ్యారు. ఉన్నవి లేనివి కలిపి.. హరీష్ రావు తమపై యాగీ చేస్తున్నారని అన్నారు.
By: Tupaki Desk | 26 Oct 2025 5:57 AM ISTతెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ముఖ్యంగా మంత్రులను ఉద్దేశించి బీఆర్ ఎస్ కీలక నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. మంత్రుల మధ్య సఖ్యత లేదని.. వారి పంచాయతీలు తీర్చేందుకే.. కేబినెట్ సమా వేశం ఏర్పాటు చేశారని.. ఇది కేబినెట్ సమావేశం కాదని.. పంచాయతీల సమావేశం అని మాజీ మంత్రి బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు ఎద్దేవా చేశారు.
అయితే.. ఈవ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తాజాగా ఫైర్ అయ్యారు. ఉన్నవి లేనివి కలిపి.. హరీష్ రావు తమపై యాగీ చేస్తున్నారని అన్నారు. మంత్రి వర్గ సమావేశం జరిగినప్పుడు.. గోడ చాటున ఉండి హరీష్‌రావు ఏమన్న విన్నడా? అని ప్రశ్నించారు. మంత్రి వర్గ సమావేశంలో జరగనివి.. జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏ విషయంపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమేనని.. సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చిద్దామని సవాల్ రువ్వారు.
గత పదిళ్ల పాలనలో ప్రజలకు కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని వారు.. ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారని అడ్లూరి దుయ్యబట్టారు. ``మేం అధికారంలోకి వచ్చి 20 నెలలే అయింది. ఇంతలోనే అంత అక్కసు ఎందుకు? మాపై ఇంత దిగజారుడు కామెంట్లు ఎందుకు చేస్తున్నారు. ఏదైనా ఉంటే.. రాజకీయం గా కొట్లాడాలి. వ్యక్తిగతంగా ఇష్యూలు చేయడం ఎందుకు?`` అని అడ్లూరి ప్రశ్నించారు. తనకు వ్యక్తిగత ప్రతిష్ఠ, ఆత్మగౌరవం చాలా ముఖ్యమంత్రి లక్ష్మణ్ అన్నారు.
తానేమీ.. ఫామ్ హౌస్‌ల కోసం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. మంత్రి వర్గం ముచ్చట్లు ఎన్నో ఉంటాయన్న అడ్లూరి.. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. లేనిపోని వివాదాలు సృష్టించి.. తమను అవమానించేలా మాట్లాడుతున్నారని హరీష్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో ప్రజలకు ఏమీ చేయని వారు.. 20 మాసాల ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. ``పదేళ్లలో మీరేం చేశారో.. 20 నెలల్లో మా ప్రభుత్వం ఏం చేసిందో అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చిద్దాం. రా!`` అంటూ.. హరీష్‌రావుకు సవాల్ రువ్వారు.
