మోదీ పిలుపు.. మారిన భారతీయుల టూరిజం ట్రెండ్.. లక్షద్వీప్ గణాంకాలు చెబుతున్న అసలు కథ
ప్రధాని ఒక పిలుపు ఇస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థపై.. ప్రజల ప్రయాణ ప్రాధాన్యతలపై ఎలాంటి పెను మార్పులు తీసుకురాగలదో చెప్పడానికి లక్షద్వీప్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.
By: A.N.Kumar | 20 May 2026 5:00 AM ISTదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే పిలుపులను దేశ ప్రజలు ఎంతవరకు పాటిస్తారు? అవి కేవలం రాజకీయ సభల నినాదాలకే పరిమితమవుతాయా? లేక సామాన్యుల దైనందిన జీవనశైలిని.. వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలనుకుంటే.. తాజాగా వెలుగులోకి వచ్చిన లక్షద్వీప్ పర్యాటక రంగ గణాంకాలను పరిశీలించాల్సిందే. ప్రధాని ఒక పిలుపు ఇస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థపై.. ప్రజల ప్రయాణ ప్రాధాన్యతలపై ఎలాంటి పెను మార్పులు తీసుకురాగలదో చెప్పడానికి లక్షద్వీప్ ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.
రికార్డుల రాత మార్చిన ఆర్టీఐ వివరాలు
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన తాజా వివరాల ప్రకారం.. గత నాలుగేళ్లలో లక్షద్వీప్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య ఊహించని రీతిలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పెరిగింది. ముఖ్యంగా 2024 జనవరి నెలలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత అక్కడి టూరిజం చిత్రపటమే మారిపోయింది. ఒకప్పుడు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి భారతీయులు విదేశీ బీచ్ డెస్టినేషన్ అనగానే మాల్దీవుల వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మన దేశంలోని లక్షద్వీప్ వేగంగా భర్తీ చేస్తోందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గణాంకాలను పరిశీలిస్తే.. 2020వ సంవత్సరంలో కేవలం 3,875 మంది పర్యాటకులు మాత్రమే లక్షద్వీప్‌ను సందర్శించారు. కానీ 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 68,328 మందికి చేరింది. కేవలం 2023 సంవత్సరంతో పోల్చి చూసినా 2024లో దాదాపు 47 శాతం పర్యాటక వృద్ధి నమోదు కావడం విశేషం.
మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ!
ఇదే సమయంలో భారతీయ పర్యాటకులపైనే ఎక్కువగా ఆధారపడే మాల్దీవుల టూరిజం మార్కెట్ భారీగా కుదేలైంది. మాల్దీవుల పర్యాటక శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. 2023లో దాదాపు 2.09 లక్షల మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించగా, 2024 నాటికి ఆ సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. అంటే కేవలం ఏడాది వ్యవధిలోనే మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్యలో సుమారు 37.5 శాతం తగ్గుదల నమోదైంది.
ఈ మార్పు వెనుక ఉన్న అసలు కథేంటి?
2024 జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అక్కడి స్వచ్ఛమైన నీలం రంగు సముద్ర తీరాలు, స్నార్కెలింగ్ అనుభవాలను పంచుకుంటూ.. "భారతదేశంలోనే ప్రపంచ స్థాయి టూరిజం అనుభవాన్ని పొందవచ్చు" అంటూ ఆయన దేశ ప్రజలకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు.
సరిగ్గా అదే సమయంలో మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు ప్రధాని మోదీపై, భారతీయులపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఇది కాస్తా తీవ్ర రూపం దాల్చి సోషల్ మీడియాలో "బాయ్‌కాట్ మాల్దీవ్స్" ట్రెండ్‌గా మారింది. దీనికి తోడు పలువురు భారతీయ సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, ప్రముఖ ట్రావెల్ బుకింగ్ సంస్థలు సైతం మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటూ లక్షద్వీప్‌ను ప్రమోట్ చేశాయి. ఫలితంగా దేశీయ పర్యాటక రంగంలో లక్షద్వీప్ ఒక హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఆర్థిక అనిశ్చితి వేళ మోదీ కొత్త పిలుపు!
లక్షద్వీప్ సాధించిన ఈ విజయం కేవలం పర్యాటక రంగానికే పరిమితం కాలేదు. ప్రస్తుతం ఇరాన్ యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. ప్రధాని మోదీ దేశ ప్రజలకు మరో కీలకమైన పిలుపునిచ్చారు. దేశీయ ప్రయోజనాల దృష్ట్యా, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కోసం ప్రజలు తమ వినియోగ అలవాట్లను మార్చుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
అనవసరమైన విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇంధన వినియోగాన్ని అదుపులో ఉంచుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా ఉపయోగించాలని, అలాగే బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని ఆయన కోరుతున్నారు. లక్షద్వీప్ ఉదాహరణను బట్టి చూస్తే ప్రధాని మోదీ జాతీయతతో కూడిన ఆర్థిక సందేశాలు ఇచ్చినప్పుడు ప్రజలు దాన్ని కేవలం నినాదాలుగా తీసుకోకుండా తమ నిజ జీవితంలో ఆచరిస్తూ స్పష్టమైన ప్రవర్తనా మార్పును చూపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా గణాంకాలపై వీడని సస్పెన్స్!
అయితే ఈ విజయ ప్రస్థానంలో ఒక ఆసక్తికరమైన సందేహం కూడా తెరపైకి వచ్చింది. 2026లో దాఖలైన ఈ ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం సమాధానమిస్తూ కేవలం 2024 వరకే పర్యాటక గణాంకాలను వెల్లడించింది. కానీ గడిచిన 2025 సంవత్సరానికి సంబంధించిన పర్యాటకుల సంఖ్యను మాత్రం అందులో చేర్చలేదు. లక్షద్వీప్‌లో టూరిజం ఇంతలా ఊపందుకున్న తరుణంలో గతేడాది (2025) నాటి తాజా గణాంకాలను ప్రభుత్వం ఎందుకు అధికారికంగా వెల్లడించలేదు? మౌలిక సదుపాయాల కొరత లేదా పర్యాటక సామర్థ్య పరిమితుల వల్ల ఏమైనా మార్పులు జరిగాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు పర్యాటక రంగ నిపుణుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ ఒక దేశాధినేత పిలుపుతో దేశ ప్రజల ఆలోచనా విధానం, ప్రయాణ అలవాట్లు మారి.. ఒక ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి రావడం మాత్రం భారత పర్యాటక చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది.
