Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పోటీ చేసే స‌మ‌స్యే లేదు కానీ...!

అవును... రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ లతో లగడపాటి క్లోజ్‌ డోర్‌ సమావేశాలు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 5:03 AM GMT
మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పోటీ చేసే స‌మ‌స్యే లేదు కానీ...!
X

వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచీ ఏపీలో ఆ పార్టీ సీనియర్లు, మాజీలలో కొత్త ఉత్సాహం వచ్చినట్లుగా అనిపిస్తుంది! ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రెస్ మీట్లు, కొత్త కొత్త స్టేట్ మెంట్లు, టీవీ డిబేట్లలో అవకాశలతో కాస్త సందడి అయితే నెలకొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. దీంతో పలు ఊహాగాణాలు తెరపైకి వచ్చాయి.

అవును... రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ లతో లగడపాటి క్లోజ్‌ డోర్‌ సమావేశాలు నిర్వహించారు. ముందుగా హర్షకుమార్ ని కలిసిన లగడపాటి.. అనంతరం ఉండవల్లి ఇంటికి వచ్చారు. దీంతో మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో ఈ విషయాలపై స్పందించిన లగడపాటి... మళ్లీ ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు.

ఫ్యామిలీ ఫంక్షన్ కి హాజరయ్యేందుకు కాకినాడ వెళ్లిన సమయంలో హర్షకుమార్‌, ఉండవల్లిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇదే సమయంలో... తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, జీవీ హర్షకుమార్‌ లు ఎన్నికల్లో ఎక్కడనుంచి, ఏ పార్టీ నుంచి పోటీ చేసినా తన మద్దతు వారికి ఉంటుందని స్పష్టం చేశారు!

ఇక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీల మధ్య పోటీ లేదని చెప్పిన లగడపాటి... ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీల మధ్య పోరు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో జాతీయ పార్టీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం అని తెలిపారు.

వాస్తవానికి లగడపాటి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారని.. ఇందులో భాగంగా విజయవాడ లేదా గుంటూరు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ పై పోటీ చేయాలని భావిస్తున్నారని.. ఇదే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పలుమార్లు టచ్ లోకి వెళ్లారని.. అనుచరులతో సైతం భేటీ అయ్యారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే లగడపాటి మాత్రం తాను ఎన్నికల రాజకీయాల్లోకి రానని చెబుతున్నారు!!