Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆంధ్రా అక్టోపస్‌!

2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసినవారిలో లగడపాటి ఒకరు

By:  Tupaki Desk   |   6 Sep 2023 10:40 AM GMT
రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఆంధ్రా అక్టోపస్‌!
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో లగడపాటి రాజగోపాల్‌ గురించి తెలియనివారు లేరు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయవాడ లోక్‌ సభా నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 2004లో అయితే టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రముఖ నిర్మాత అశ్వినీదత్తును లగడపాటి ఓడించారు. 2009లో టీడీపీ తరఫున పోటీ చేసిన ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై లగడపాటి విజయం సాధించారు.

2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలసి రాష్ట్రమంతా పాదయాత్ర చేసినవారిలో లగడపాటి ఒకరు. పారిశ్రామికవేత్తగా ఉన్న ఆయన ఆ ఎన్నికల్లో తొలిసారి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనను వ్యతిరేకిస్తూ లగడపాటి గట్టిగా పోరాడారు. పార్లమెంటులోనూ విభజనను వ్యతిరేకించారు. పార్లమెంటులో పెప్పర్‌ స్ప్రే చల్లారంటూ ఆయనపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి.

కాంగ్రెస్‌ అధిష్టానం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను విభజించడంతో లగడపాటి రాజగోపాల్‌ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.

కాగా గతంలో లగడపాటి నిర్వహించే ఎన్నికల సర్వేలకు విపరీతమైన ఆదరణ ఉండేది. సొంతంగా తన టీమ్‌ ద్వారా సర్వేలు నిర్వహించేవారు. మొదట్లో ఆయన చెప్పినట్టే ఎన్నికల్లో ఫలితాలు వచ్చేవి. అయితే 2019 ఎన్నికల ముందు లగడపాటి నిర్వహించిన సర్వేలు విఫలమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని లగడపాటి చెప్పగా వైసీపీ ఘనవిజయం సాధించింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇకపై సర్వేలు నిర్వహించనని ప్రకటించారు.

ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వివిధ పార్టీలు ఆయనకు గేలం వేస్తున్నట్టు చెబుతున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ ఇలా అన్ని పార్టీలు ఆయనను తమ పార్టీలోకి రావాలని కోరుతున్నట్టు టాక్‌ నడుస్తోంది. అందులోనూ 20014, 2019లో విజయవాడలో వైసీపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆ పార్టీకి గట్టి అభ్యర్థి ఇక్కడ లభించడం లేదు. ఇక టీడీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయం సాధించారు.

కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సైతం మరో గట్టి అభ్యర్థి వెతుకలాటలో ఉంది. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెబుతున్నా లగడపాటి అయితేనే సరైన అభ్యర్థి అవుతారని అంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలకు అభ్యర్థుల కొరత ఉంది.

లగడపాటి కూడా రాజకీయాల్లో రీఎంట్రీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. తాజాగా విజయవాడలోని ఒక హోటల్‌ లో లగడపాటి తన సన్నిహితులైన నేతలు, ముఖ్య అనుచరులతో మంతనాలు జరిపారు. రాజకీయాల్లో రీఎంట్రీకి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అన్ని చోట్ల మరిన్ని సమావేశాలను లగడపాటి నిర్వహిస్తారని తెలుస్తోంది. విజయవాడలో జరిగిన తాజా సమావేశంలో ఆయన అనుచరులంతా మళ్లీ పాలిటిక్స్‌ లోకి రావాలని ఆయనను కోరినట్టు తెలుస్తోంది. మరి లగడపాటి ఏ పార్టీలో చేరతారో వేచిచూడాల్సిందే.