Begin typing your search above and press return to search.

విశాఖను టార్గెట్ చేస్తున్న కేవీపీ...!

ఈ దఫా అధికారంలోకి రావచ్చు అన్న సూచనలు కూడా ఉన్నాయి. దాంతో తెలంగాణాలో కాంగ్రెస్ వస్తే ఏపీలో కూడా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఊహిస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 4:31 PM GMT
విశాఖను టార్గెట్ చేస్తున్న కేవీపీ...!
X

కేవీపీ రామచంద్రరావు. రాజకీయాల మీద అవగాహన ఉన్న వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఆయన వైఎస్సార్ కి ఆత్మగా అంతా చెప్పుకుంటారు. వైఎస్సార్ తో ఆయన దోస్తీ నలభై ఏళ్ల పై వరకూ సాగింది. వైఎస్సార్ మరణించేటంతవరకూ కేవీపీ ఆయనతోనే ఉన్నారు. వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తే మొత్తం పార్టీలో ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ గా కేవీపీ ఉండేవారు.

అంతా ఆయన చుట్టూనే చేరేవారు. అలా కాంగ్రెస్ హయాంలో కేవీపీ చక్రం గిర్రున తిరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ విభజన తరువాత ఏపీలో అంతర్ధానం కావడం, వైఎస్సార్ దాని కంటే ముందే మరణించడంతో కేవీపీ ప్రభ మసకబారింది. ఆయన మరోమారు రాజ్యసభ సభ్యుడు కాగలిగారు కానీ వైఎస్సార్ నాటి టాప్ గ్రేడ్ పొలిటిషియన్ హోదాను మాత్రం అనుభవించలేకపోయారు.

అయితే వైఎస్సార్ మిత్రుడిగా కంటే కూడా కాంగ్రెస్ సీనియర్ గా కాంగ్రెస్ హై కమాండ్ వద్ద కేవీపీకి ఇప్పటికి కొంత సాన్నిహిత్యం ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఏ నిర్ణయం విషయంలో అయినా ఆయనతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు సలహా సంప్రదింపులు చేస్తారని టాక్.

ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణాలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఈ దఫా అధికారంలోకి రావచ్చు అన్న సూచనలు కూడా ఉన్నాయి. దాంతో తెలంగాణాలో కాంగ్రెస్ వస్తే ఏపీలో కూడా ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఊహిస్తున్నారు. దాంతో మరోమారు కేవీపీ సేవలను ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిందా అన్న చర్చ వస్తోంది.

వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలన్న ఆలోచన వెనక కూడా కేవీపీ ఉన్నారని అంటారు. ఇక ఎన్నికలు అయిపోయాక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేలా కేవీపీ వ్యూహ రచన చేస్తున్నారు అని అంటున్నారు.

కాంగ్రెస్ కి ఏపీలో ఒకపుడు మంచి ఓటు బ్యాంక్ ఉండేది. అలాగే కీలక వర్గాలు ఆ పార్టీ వెంట ఉండేవి. దాంతో పాటు చాలా నియోజకవరాలలో కాంగ్రెస్ హవా నడిచేది. విశాఖ లోక్ సభ సీటుని కాంగ్రెస్ అనేక సార్లు గెలుచుకుంది. తెలుగుదేశం పుట్టాక పది సార్లు ఎంపీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అయిదు సార్లు గెలిచింది. తెలుగుదేశం మూడు సార్లు, బీజేపీ ఒకసారి వైసీపీ మరోసారి గెలిచాయి.

అలా కాంగ్రెస్ కి విశాఖ ఎంపీ సీటు కంచుకోటగా ఉంది. అంతే కాదు ఉత్తరాంధ్రా కేంద్రంగా కూడా ఉంది. అందువల్ల విశాఖ మీద కేవీపీ ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఆయన ఇటీవల కాలంలో తరచూ విశాఖ వస్తున్నారు. ఈ మధ్యనే విశాఖ వచ్చినపుడు ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ పెట్టి మరీ పార్టీని పటిష్టం చేయమని సూచించారు.

విశాఖలో కాంగ్రెస్ బలపడితే దాని ప్రభావం ఉత్తరాంధ్రా మీద ఉంటుందన్న ముందు చూపుతోనే కేవీపీ ఇలా ఈ మెగా సిటీని టార్గెట్ చేశారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఇపుడు పెద్ద ఎత్తున సాగుతోంది. దాంతో రాహుల్ గాంధీని విశాఖ తీసుకుని రావాలని కేవీపీ భావిస్తున్నారు అని అంటున్నారు.

నిజం చెప్పాలంటే చాలా కాలం క్రితమే రాహుల్ విశాఖ రావాలి. ఆయన బిజీ షెడ్యూల్ వల్ల అది కుదరలేదు. తెలంగాణా ఎన్నికలు అయిన తరువాత తొందరలోనే రాహుల్ విశాఖ వస్తారని అంటున్నారు. విశాఖ ఉక్కు పోరాటానికి కాంగ్రెస్ తరఫున మద్దతు ప్రకటిస్తారని తెలుస్తోంది. తద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్రాలో కాంగ్రెస్ తన బలాన్ని అనూహ్యంగా పెంచుకుంటుంది అని అంటున్నారు.

మొత్తానికి రాహుల్ టూర్ భవిష్యత్తులో ఉన్న నేపధ్యంలో కేవీపీ ఉక్కు నగరం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రానున్న రోజులలో చాలా మంది కీలక నేతలు తిరిగి కాంగ్రెస్ లోకి చేరుతారు అని అంటున్నారు. సో కేవీపీ మంత్రాంగం మళ్లీ మొదలైంది అని అంటున్నారు. అది కూడా విశాఖ నుంచే స్టార్ట్ చేస్తున్నారు అని అంటున్నారు.