Begin typing your search above and press return to search.

పవన్ మీద వైఎస్సార్ కేసులు పెట్టారా...కేవీపీ చెప్పిందిదే ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు అంటూ పేర్లు పెట్టకుండా కొందరిని విమర్శించారు.

By:  Satya P   |   4 Jun 2026 4:44 PM IST
పవన్ మీద వైఎస్సార్ కేసులు పెట్టారా...కేవీపీ చెప్పిందిదే ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నాయకులు అంటూ పేర్లు పెట్టకుండా కొందరిని విమర్శించారు. అదే సమయంలో వైఎస్సార్ మీద మాత్రం విమర్శలు సంధించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ గురించి కొన్ని కామెంట్స్ కూడా చేశారు. వైఎస్సార్ పాలనలో తమ వద్దకు ఒక పోలీస్ అధికారి వచ్చారని కూడా చెప్పారు. తాము రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా అడిగి ఆరా తీసారని కూడా పవన్ చెప్పారు. అయితే ప్రాంతీయ వాదం మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేయడంతో వైఎస్సార్ మీద చేసిన విమర్శలు కొంత పక్కకు వెళ్ళాయి. కానీ దీనిని వైఎస్సార్ నీడగా అంతా చెప్పుకునే ఆయన ప్రాణ స్నేహితుడు రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తప్పుపట్టారు. దీంతో ఆయన పవన్ కళ్యాణ్ కి ఘాటు లేఖను తాజాగా సంధించారు.

కాంగ్రెస్ అంటే వైఎస్సార్ :

ఆ లేఖలో కేవీపీ కొంత వ్యంగ్యోక్తులు కూడా చేశారు. కాంగ్రెస్ అనగానే వైఎస్సార్ గుర్తొచ్చినందుకు ధన్యవాదాలు అంటూ మొదలెట్టిన కేవీపీ వైఎస్సార్ విషయంలో మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని కుండ బద్ధలు కొట్టారు. అసలు వైఎస్సార్ కి ఏపీలో ఉన్న రాజకీయ పార్టీ వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతూ పవన్ ఈ సంగతి తెలుసుకోవాలని అన్నారు ఇక వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పవన్ మీద ఎలాంటి కేసులు పెట్టలేదని కేవీపీ స్పష్టం చేశారు

లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయాలి :

పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి వైఎస్సార్ కేసులు పెట్టమన్నారు అని చెప్పిన ఆ పోలీసు అధికారికి లై డిటెక్టర్‌ టెస్ట్‌ చేయాలని కేవీపీ కోరారు. దాంతో సదరు పోలీసు అధికారి చెప్పింది తప్పు అని కేవీపీ ఖండించినట్లు అయింది. ఒక వేళ సదరు పోలీసు అధికారి చెప్పిందేం నిజమైతే తాను తెలంగా ముఖ్యమంత్రి రిలీఫ్‌ఫండ్‌కు లేదా స్వచ్ఛంద సంస్థకు పది కోట్ల రూపాయలు ఇస్తానని కేవీపీ తనదైన శైలిలో ఒక హాట్ సవాల్ చేశారు.

ఆరోపణలు అవివేకం :

వైఎస్సార్ ఈ లోకాని వీడి ఏనాడో వెళ్ళిపోయారు అని కేవీపీ గుర్తు చేశారు. వైఎస్సార్ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా ఆయనపై ఆరోపణలు చేయడం అవివేకం అని కేవీపీ పవన్ ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. అంతే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చంద్రబాబు పైన లేదా లేదా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పవన్ కళ్యాణ్ కి కేవీపీ రామచంద్రరావు సూచించారు. మొత్తానికి తన మిత్రుడు వైఎస్సార్ మీద పవన్ చేసిన కామెంట్స్ మీద కేవీపీ ధర్మాగ్రహం ప్రదర్శించారు అనుకోవాలి. రాజకీయాల్లో ఉన్న ఆయన వారసులు ఎవరూ ఖండించలేదు. అంతే కాదు వైఎస్సార్ పేరు చెప్పుకుని రాజకీయాల్లో రాణిస్తున్న వారు కూడా పవన్ వ్యాఖ్యల మీద కనీసంగా స్పందించలేదు. కేవీపీ ఘాటు లేఖతో వారంతా భుజాలు తడుముకునే పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు.