Begin typing your search above and press return to search.

ఆ కూలీలకు ‘వజ్రాల’ పంట పండింది.. ఒక్కోటి రూ.50 లక్షలు

వారిద్దరూ వ్యవసాయ కూలీలే.. అందులో ఒకరు మహిళ కూడా.. సొంతంగా పొలం పండించుకోలేని వారి పంట పడింది.

By:  Tupaki Desk   |   10 July 2025 9:41 AM IST
ఆ కూలీలకు ‘వజ్రాల’ పంట పండింది.. ఒక్కోటి రూ.50 లక్షలు
X

వారిద్దరూ వ్యవసాయ కూలీలే.. అందులో ఒకరు మహిళ కూడా.. సొంతంగా పొలం పండించుకోలేని వారి పంట పడింది. అదికూడా వజ్రాల పంట కావడం గమనార్హం. ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి, తదితర మండలాల్లో తొలకరి వర్షాలతో వజ్రాలు దొరుకుతాయనే పేరుంది. గతంలో ఇలా ఎన్నోసార్లు జరిగింది కూడా. దీనికోసం వేరే జిల్లాలు, ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వాహనాల్లో తరలివచ్చి, రోజుల తరబడి పొలాల్లో నివాసం ఉంటారు. వంటవార్పు అక్కడే చేసుకుంటారు. ఇలా తుగ్గలి మండలం పెండెగల్లు గ్రామంలో తాజాగా ఓ మహిళా కూలీకి 15 క్యారెట్ల వజ్రం దొరికింది. కాగా, దీన్ని కొనేందుకు వ్యాపారి రూ.పది లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, దొరికిన వజ్రం విలువ 50 లక్షలు ఉంటుందన్న సమాచారంతో ఆ మహిళా కూలీ అమ్మేందుకు నిరాకరించింది.

15 క్యారెట్ల వజ్రం అంటే చాలా ఖరీదైనదే. పెద్దగానూ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్యారెట్ వజ్రం ధర వెయ్యి డాలర్ల నుంచి 20 వేల డాలర‍్లు (రూ.85 వేలు-రూ.17 లక్షలు) అని అంచనా. అదీ 15 క్యారెట్ల వజ్రం మంచి నాణ్యత ఉంటే 15 వేల డాలర్లు నుంచి 3 లక్షల డాలర్లు ఉంటుంది. అ లెక్కన కర్నూలు మహిళా కూలీకి రూ.12.75 లక్షల నుంచి రూ.2.55 కోట్ల విలువైన వజ్రం దొరికిందని లెక్కగట్టవచ్చు.

కాగా, కర్నూలు జిల్లాలోని తుగ్గలి తదితర ప్రాంతాల లాగే మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోనూ వజ్రాలు దొరుకుతాయి. గతంలో 2.69 క్యారెట్ల వజ్రం రూ.50 లక్షలకు అమ్ముడుపోయింది. ఇప్పుడు అదే పన్నా జిల్లాలో గనిలో పనిచేసేందుకు వెళ్తే.. కార్మికుడికి వజ్రం దొరికింది. అయితే, దానిని మెరుస్తున్న రాయిగా తొలుత చేతిలోకి తీసుకున్న కార్మికుడికి జాక్‌పాట్‌ తగిలిట్లు అయింది.

పన్నాలో గిరిజన కార్మికుడు మాధవ్‌.. కృష్ణ కల్యాణ్ పట్టి గనిలో పని చేస్తుంటాడు. ఇతడికే రూ.40 లక్షల పైగా విలువైన వజ్రం దొరికింది. ఒక్కరోజులోనే మాధవ్‌ లక్షాధికారి అయ్యాడు. పన్నా జిల్లా బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉంటుంది. వజ్రాలకు ప్రసిద్ధి. 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ నిక్షేపాలను వెలికితీసే కార్మికుల్లో ఒకడే మాధవ్‌. ఇతడికి దొరికిన వజ్రం 11.95 క్యారెట్ల బరువుది. చాలా స్వచ్ఛంగా, అత్యంత విలువైనదని అధికారులు గుర్తించారు. ఇక మాధవ్‌.. నిబంధనల ప్రకారం పన్నా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. తర్వాత నాణ్యత, పరిమాణం ఆధారంగా దాని విలువను అంచనా వేసి, వేలం నిర్వహిస్తారు. వేలంలో వచ్చిన మొత్తంలో.. 12.5 శాతం రాయల్టీ పోగా మిగతా డబ్బును వజ్రం దొరికినవారికి ఇస్తారు. మరి మాధవ్‌కు ఎంత వస్తాయో?