ఆదివారం అర్థరాత్రి వేళ హటాత్తుగా కర్నూలు ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు ప్రజలు భయంకర అనుభవం ఎదురైంది.
By: Tupaki Desk | 5 May 2025 4:50 AMఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు ప్రజలు భయంకర అనుభవం ఎదురైంది. గుర్తుకు వస్తేనే ఒళ్లు జలదరింపునకు గురయ్యే ఈ ఉదంతంలో కర్నూలు పట్టణంలోని పలు ప్రాంతాల వారు శ్వాస తీసుకోవటానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అప్పటివరకు అంతా బాగానే ఉన్న పరిస్థితులు అంత దారుణంగా మారిపోవటానికి.. వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావటానికి కారణం ఒక ట్యాంకర్.
అవును.. మీరు చదివింది కరెక్టే. ఒక ట్యాంకర్ లో కారణంగా ఆదివారం అర్థరాత్రి వేళ కర్నూలు పట్టణ ప్రజలకు తీవ్ర అవస్థలకు గురి కావాల్సి వచ్చింది. నేషనల్ హైవే మీదుగా వెళుతున్న ఒక లారీ (హైడ్రో క్లోరిక్ యాసిడ్) లోడ్ తో వెళుతోంది. కారణం ఏమిటన్నది తెలీదు కానీ.. ఉన్నట్లుండి లారీలో నుంచి హైడ్రో క్లోరిక్ యాసిడ్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించిన లారీ డ్రైవర్.. ఆ ట్యాంకర్ ను అలానే వదిలేసి పారిపోయాడు.
ఆదివారం అర్థరాత్రి వేళ ఈ ఉదంతం చోటు చేసుకుంది. కర్నూలు పట్టణంలోని సంతోష్ నగర్ ఈద్గా ప్రాంతంలో.. వెంకటరమణ కాలనీ వంతెన వద్ద దాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో.. ఈ గ్యాస్ కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న వేలాది మంది తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఒక దశలో శ్వాస తీసుకోవటానికి తీవ్ర అవస్థలకు గురయ్యారు ప్రజలు. ఒకదశలో లీకైన ఈ రసాయనం.. నీళ్ల మాదిరి రోడ్ల మీద ప్రవహించింది. ఈ నేపథ్యంలో సంతోష్ నగర్ నుంచి తుంగభద్ర నది వరకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది. కొద్ది గంటల పాటు తీవ్ర దుర్గంధంతో పాటు శ్వాస తీసుకోవటానికి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.