Begin typing your search above and press return to search.

‘కుప్పం’ కోటను జయించేది వైసీపీయే.. ఎందుకంటే!

వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు.. కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం.

By:  Tupaki Desk   |   20 May 2024 8:30 AM GMT
‘కుప్పం’ కోటను జయించేది వైసీపీయే.. ఎందుకంటే!
X

వైసీపీ ఏపీలో ప్రధానంగా దృష్టి సారించిన నియోజకవర్గాలు.. కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురం. ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా ఈ నలుగురిని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత ఎన్నికల్లో నారా లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ ను వైసీపీ ఓడించగలిగింది. చంద్రబాబు, బాలకృష్ణలను మాత్రం వైసీపీ పెనుగాలి వీచిన 2019 ఎన్నికల్లో ఓడించలేకపోయింది.

ఈసారి మాత్రం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రణాళిక వర్కవుట్‌ అయ్యిందని అంటున్నారు. ఈసారి పవన్‌ కళ్యాణ్, లోకేశ్, బాలకృష్ణలతో పాటు చంద్రబాబు కూడా ఓడిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.

చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కుప్పంను మున్సిపాలిటీ చేసుకోలేకపోయారు. అలాగే రెవెన్యూ డివిజన్‌ గా కూడా చేయలేకపోయారు. అలాగే హంద్రీ నీవా జలాలను కుప్పం నియోజకవర్గానికి అందించలేకపోయారని గుర్తు చేస్తున్నారు.

అయితే వైసీపీ తొలిసారి అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేత నియోజకవర్గమని వదిలిపెట్టకుండా అభివృద్ధి చేసిందని అంటున్నారు. ఇందుకు వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించిందని చెబుతున్నారు. వైసీపీ పాలనలోనే కుప్పం మున్సిపాలిటీ అయ్యిందని, రెవెన్యూ డివిజన్‌ ను చేశామని ఇప్పటికే సీఎం జగన్‌ పలుమార్లు చెప్పారు. 1989 నుంచి కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మునిసిపాలిటీని కూడా చేయలేకపోయారని, రెవెన్యూ డివిజన్‌ ను కూడా చేసుకోలేకపోయారని జగన్‌ విమర్శించారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్రభుత్వంలో నంబర్‌ టూ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్‌ బాధ్యతలు కట్టబెట్టారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి పలుమార్లు కుప్పంలో పర్యటించారు. చంద్రబాబును ఓడించడానికి ప్రత్యేక ప్రణాళికను అమలు చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్, పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో 90 శాతం స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఈసారి అసెంబ్లీ స్థానం కూడా తమకే దక్కుతుందని వైసీపీ ధీమాగా ఉంది. చంద్రబాబు ఓటమి ఖాయమని తేల్చిచెబుతోంది.

వైసీపీ తరఫున కేజే భరత్‌ పోటీ చేస్తున్నారు. వన్నికుల క్షత్రియ సామాజికవర్గానికి చెందినవారు ఈయన. పెత్తందారు అయిన చంద్రబాబుపై తాము బీసీ అభ్యర్థిని బరిలో నిలపామని ఆయనను గెలిపించాలని సీఎం జగన్‌ తన ప్రచారంలో కోరారు.

వాస్తవానికి కేజే భరత్‌ ను ఎమ్మెల్సీని చేయడంతోపాటు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిని కూడా ఆయనకు జగన్‌ కట్టబెట్టారు. కుప్పం ప్రజలు వైసీపీ వైపు తిరగడానికి కావాల్సిన అన్ని సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను అమలు చేశారు. దీనికి తగ్గట్టే పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్ఫలితాలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలోని 90 శాతం స్థానాలను వైసీపీ గెలుచుకుంది.

అయితే 1989 నుంచి వరుసగా ఏడుసార్లు కుప్పం నుంచి చంద్రబాబు విజయం సాధించారు. ప్రతిసారీ ఆయన మెజారిటీ తగ్గుతుండటం గమనార్హం.

అందులోనూ ఈసారి చంద్రబాబు కుప్పంలో పెద్దగా పర్యటించలేదు. ఎప్పటిలానే స్థానిక నేతలతోపాటు తన సతీమణి భువనేశ్వరికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు తరఫున భువనేశ్వరే ప్రచారాన్ని నడిపించారు. ఈ క్రమంలో ఆమె దళితులను దూషిస్తున్నట్టు ఒక ఆడియో వైరల్‌ గా మారింది. ఇది చంద్రబాబుకు నష్టం చేసిందనే అంచనాలున్నాయి.

కుప్పంలో చంద్రబాబు తన ప్రచారాన్ని తేలికగా తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రెండు మూడు సభలు నిర్వహించారు. మరోవైపు వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఆయన వ్యూహాలు తమకు విజయం సాధించి పెడతాయని నమ్ముతోంది. అందుకు తగ్గట్టే పెద్దిరెడ్డి కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించారు.

తాను చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి జిల్లాలో టీడీపీకి అత్యధిక స్థానాలు రాలేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రమే గెలుస్తున్నారని.. టీడీపీకి మాత్రం మెజారిటీ స్థానాలు రాలేదని అంటున్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని.. కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయమని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హంద్రీ నీవా ద్వారా నీటిని కూడా అందించామని ఆయన గుర్తు చేశారు. తాము ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి వస్తామని.. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.