Begin typing your search above and press return to search.

కుమారస్వామి ఓకే...మోడీని ఒప్పించాల్సిందేనా ?

గత మూడున్నరేళ్లుగా ఈ తరహా హామీనే ఉక్కు కార్మికులు ఉద్యోగులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసారు.

By:  Tupaki Desk   |   11 July 2024 1:34 PM GMT
కుమారస్వామి ఓకే...మోడీని ఒప్పించాల్సిందేనా ?
X

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నోటి నుంచి చల్లని మాట అయితే వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించే పరిస్థితి లేదు అని కేంద్ర ఉక్కు మంత్రిగా హెచ్ డీ కుమారస్వామి గట్టి భరోసా ఇచ్చారు. గత మూడున్నరేళ్లుగా ఈ తరహా హామీనే ఉక్కు కార్మికులు ఉద్యోగులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూసారు.

ఇంత స్పష్టంగా ఈ ప్రకటన రావడం మాత్రం ఇదే ప్రధమం. 2021 ఫిబ్రవరి నెలలో ఉక్కు ప్రైవేటీకరణ మీద కేంద్రం నుంచి సంకేతాలు అందాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ కుమారస్వామి తరహాలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేవారు లేరు. ఇక గత కేంద్ర ప్రభుత్వంలో ఉక్కు శాఖను బీజేపీకి చెందిన వారే చూసారు. కానీ ఇపుడు మాత్రం అది కాస్తా మిత్ర పక్షం అయిన జేడీఎస్ కి దక్కింది.

దాంతో పాటు కుమారస్వామిది ప్రాంతీయ పార్టీ. ఆయన పార్టీ కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం. అయితే బీజేపీ పెట్టుబడుల ఉపసంహరణ అన్నది ఒక విధానంగా పెట్టుకుని పనిచేస్తోంది అని అంటున్నారు. అది కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికే కాదు కాదు చాలా ప్రభుత్వ రంగ సంస్థల విషయంలోనూ ఇదే పాలసీని అమలు చేయాలని చూస్తున్నారు.

కేంద్రం వ్యాపారాలు చేయదు, చేయకూడదు అన్నది బీజేపీ ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెబుతారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కుని సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆయన సందర్శించి లోపల జరుగుతున్న కార్యకలాపాలను తెలుసుకున్నారు. విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులతోనూ అలాగే కార్మిక సంఘాలు ఉద్యోగులతో మాట్లాడారు.

అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నదే లేదని అన్నారు. దేశ ఆర్ధిక ప్రగతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ అత్యంత ముఖ్య భూమికను పోషిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి తాను విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక ప్రత్యేక నోట్ ని తయారు చేసి అందిస్తాను అని అన్నారు.

ఎవరూ ప్లాంట్ భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సింది లేదని కూడా కుమారస్వామి చెప్పారు. పైగా ఆయన మరో మంచి మాట అన్నారు. విశాఖ వాసుల కార్మికుల ఉద్యోగుల సెంటిమెంట్ స్టీల్ ప్లాంట్ అని. అందువల్ల దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ప్రైవేట్ పరం చేయబోమని కూడా స్పష్టం చేశారు. తాను స్టీల్ ప్లాంట్ లో గుర్తించిన ప్రతీ అంశాన్ని ప్రధాని మోడీకి వివరిస్తాను అని కూడా ఆయన హామీ ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ వంద శాతం సామర్ధ్యంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి చూస్తే కుమార స్వామి పూర్తి భరోసా ఇచ్చి వెళ్ళారు. ఆయన వరకూ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయకూడదనే పట్టుదలగా ఉన్నారు. అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమి ఆలోచిస్తుంది అన్నది చూడాలి. కేంద్రం కూడా సానుకూలంగా ఉంటే ఉక్కు గండం గట్టెక్కినట్టే అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ ఉక్కు కార్మిక లోకానికి మంచి మాటను చెప్పి వెళ్ళిన కుమారస్వామిని అంతా అభినందిస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు.