Begin typing your search above and press return to search.

కందుల జాహ్నవి కేసు.. సీరియస్ గా రియాక్ట్ అయిన కేటీఆర్!

ఈ క్రమంలో ఆమె మృతిపై స్థానిక పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన పరిణామాలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు!

By:  Tupaki Desk   |   22 Feb 2024 10:24 AM GMT
కందుల జాహ్నవి కేసు.. సీరియస్  గా రియాక్ట్  అయిన కేటీఆర్!
X

గతేడాది అమెరికాలోని సియాటెల్‌ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి (23) మృతి చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు దాటుతుండగా... పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో జాహ్నవి అక్కడికక్కడే మరణించింది. ఈ క్రమంలో ఆమె మృతిపై స్థానిక పోలీసు అధికారి ఒకరు చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన పరిణామాలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు!

అవును... అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికా పోలీసు అధికారి కెవిన్‌ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని.. సాక్ష్యాధారాలు లేకపోవడమే అందుకు కారణమని కింగ్‌ కౌంటీ ప్రాసిక్యూటింగ్‌ కార్యాలయం ప్రకటించిన విషయంపై సర్వత్రా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందులో భాగంగా... ఈ వ్యవహారంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడాలని.. కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంపై స్పందించాలని.. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఇదే సమయంలో అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే.. ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా ఈ కేసు తేలిపోవడం మరింత విషాదకరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

కాగా... ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌ లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై స్థానిక పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. పగలబడి నవ్వుతూ, చులకనగా మాట్లాడిన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్‌ అయ్యింది. "ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ చావుకు విలువలేదు" అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది.

దీంతో ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇందులో భాగంగా... సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. ఈ క్రమంలో అతడిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అతనిపై చర్యల తుది విచారణ మార్చి 4న కోర్టులో జరగనుందని తెలుస్తుంది! ఈ సమయంలో.. ఆమె మృతికి కారణమైన అధికారిపై నేరాభియోగాలు మోపడం లేదని అధికారులు వెల్లడించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది!