Begin typing your search above and press return to search.

లోకేష్ ని ఫాలో అవుతున్న కేటీఆర్ !

ఏపీలో నారా లోకేష్ అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక విధంగా రాటు దేలారు. పప్పు కాదు నిప్పు కణిక అనిపించుకున్నారు

By:  Tupaki Desk   |   10 July 2024 3:48 AM GMT
లోకేష్ ని ఫాలో అవుతున్న కేటీఆర్   !
X

ఏపీలో నారా లోకేష్ అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక విధంగా రాటు దేలారు. పప్పు కాదు నిప్పు కణిక అనిపించుకున్నారు. ఆయన ఒక విధంగా చాలా మందికి రోల్ మోడల్ గా నిలిచారు. ఇపుడు లోకేష్ ని బీఅర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ ఫాలో అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది.

అందుకే అంటారు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయని. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినపుడు లోకేష్ ఢిల్లీలోనే కూర్చున్నారు. ఆయన వారాల తరబడి అక్కడే ఉన్నారు. బీజేపీ వారితో టై అప్ అయి వాళ్లతో సీట్ల సర్దుబాటు చేసుకుని సక్సెస్ ఫుల్ గా చంద్రబాబుకు బెయిల్ ఇప్పించుకున్నారు అని అంతా అనుకున్నారు.

ఇపుడు అదే ఫార్ములాను కేటీఆర్ కూడా అనుసరిస్తున్నారు అని అంటున్నారు. కేటీఆర్ కూడా ఇపుడు ఢిల్లీలోనే ఉంటున్నారు. లోకేష్ మాదిరిగానే ఢిల్లీ మీడియాతో చిట్ చాట్ చేస్తున్నారు. వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ ని ఎక్కువగా విమర్శిస్తూ బదనాం చేస్తూ వస్తున్నారు.

దాంతో బీజేపీ కవిత విషయంలో ఏమైనా సానుకూలతతో వ్యవహరిస్తుందని కేటీఆర్ ఆరాటపడుతున్నారు అని అంటున్నారు. అయితే గతంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళిన సందర్భం వేరు. ఆనాటి రాజకీయం వేరు. అపుడు ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. పైగా ఏపీలో బీజేపీకి అవసరం చాలా ఉంది. ఏపీలో పొత్తుల కోసం బీజేపీ చూస్తోంది. అయితే తానుగా ముందుకు రాని నేపధ్యంలో లోకేష్ చొరవ తీసుకోవడంతో అది సాధ్యపడింది.

ఇపుడు ఎటూ ఎన్నికలు లేవు. పైగా బీఆర్ఎస్ తో తెలంగాణాలో బీజేపీకి ఏ రకమైన అవసరమూ రాజకీయంగా చూస్తే లేదు. పైగా బీఆర్ఎస్ ని కోరి నెత్తిన పెట్టుకుంటే అది కాంగ్రెస్ కి నెత్తిన పాలు పోసినట్లే అన్న చర్చ కూడా కమలనాథుల్లో ఉంది. బీఆర్ఎస్ ని అలా వదిలేస్తే మరింతగా వీక్ అయి తెలంగాణాలో ఉనికి పోరాటం చేస్తూ ఉంటుందని అది బీజేపీకే అడ్వాంటేజ్ అని కూడా లెక్కలు ఉన్నాయి.

బీఆర్ఎస్ కి పోనీ లోక్ సభలో ఎంపీలు ఒక్కరైనా ఉన్నా ఇపుడు కీలకమైన సమయంలో బీజేపీకి అక్కర తీర్చేందుకు ఉపయోగించుకుంటారు. కానీ ఏ ఒక్క ఎంపీ గెలవలేదు. జీరో నంబర్ వచ్చింది. దాంతో పాటుగా చూస్తే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలో తెచ్చుకున్న 37 శాతం ఓట్ షేర్ ని కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోగొట్టుకుంది. 17 శాతానికి బీఆర్ఎస్ పడిపోతే ఆ 20 శాతం ఓటు బ్యాంక్ బీజేపీకి బదిలీ అయింది.

ఈ ఫార్ములా ఏదో బాగుందని ఎన్నికల్లో ఓట్లూ సీట్లూ పెంచుకున్న బీజేపీకి తెలిసి తెలిసి ఇపుడు బీఆర్ఎస్ బలం పెంచుతారు అనుకుంటే మాత్రం అంతకంటే రాజకీయ పొరపాటు వేరొకటి ఉండదని అంటున్నారు. ఇక ఆ మిగిలి ఉన్న 17 శాతం ఓటు బ్యాంక్ ని కూడా కాంగ్రెస్ లాగాలని చూస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుంటే బీఆర్ఎస్ కధను సుఖాంతం చేయవచ్చు అని హస్తం పార్టీ తన ప్రయత్నాలు తానుగా మొదలెట్టింది.

ఇంతలా తెలంగాణా రాజకీయ ముఖ చిత్రం స్పష్టంగా ఉంటే కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ సానుకూలత కోసం చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి చూడాల్సిందే అంటున్నారు. రాజకీయ బేరాలు రాయబారాలు సింగిల్ హ్యాండ్ చప్పట్లతో మోగేవి కావని అంటున్నారు. అటూ ఇటూ కూడా ఆసక్తి ఉండాలి, అంతకు మించి అవసరాలు ఉండాలని అంటున్నారు. అపుడే ఏ రాజకీయ వ్యూహం అయినా పండేది అని అంటున్నారు. సో కేటీఆర్ ఢిల్లీ భేటీలు ఇంటర్వ్యూలు బీజేపీ ప్రసన్నం కోసం చేసే తపస్సులు ఫలిస్తాయా అంటే వెయిట్ అండ్ సీ.