Begin typing your search above and press return to search.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ ఆగ్రహానికి కారణమేంటి?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

By:  Tupaki Desk   |   2 April 2024 7:54 AM GMT
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ ఆగ్రహానికి కారణమేంటి?
X

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈనేపథ్యంలో కేటీఆర్ పై కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోనని చెబుతున్నారు. తనపై ఆరోపణలు చేసిన పత్రికపై కూడా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైరల్ అవుతోంది. దీనిపై కేటీఆర్ కూడా ఇది పెద్ద వ్యవహారం కాదని బుకాయించారు. ఏదో నలుగురి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇంతలా బదనాం చేయడం ఏమిటని ప్రశ్నించారు. కానీ ఇంతలోనే కొత్త పల్లవి అందుకుంటున్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిని విడిచిపెట్టేది లేదని తెగేసి చెబుతున్నారు.

బీఆర్ఎస్ లో మారుతున్న రాజకీయ సమీకరణలు మరింత నష్టం కలిగిస్తున్నాయి. కవిత అరెస్టుతో చాలా మంది పార్టీని వీడిపోయారు. ఇప్పుడు చాలా మంది నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరాలని చూస్తున్నారు. దీని కోసమే ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ఓ మునిగిపోతున్న నావగా అభివర్ణిస్తున్నారు. అందుకే కడియం శ్రీహరి లాంటి నేతలు వలస వెళ్తున్నారు. భవిష్యత్ కు ఢోకా లేకుండా చూసుకుంటున్నారు.

కేసీఆర్ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు అనుమానాలు పెంచుతున్నాయి. ఇప్పటికే ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం రచ్చగా మారుతుంటే కేటీఆర్ మాత్రం పరువునష్టం దావా వేస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు వస్తున్నాయి. కేటీఆర్ మాటల్లో ఆంతర్యం ఏమిటనే వాదనలు కూడా వస్తున్నాయి.

అధికారంలో ఉండగా ఏవో పనులు చేసి ఇప్పుడు అడ్డంగా బుక్కవుతున్నారు. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు ప్రస్తుతం బీఆర్ఎస్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. కానీ కేటీఆర్ మాత్రం తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని విడిచిపెట్టేది లేదని మాట్లాడటం సంచలనం కలిగిస్తోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది.