Begin typing your search above and press return to search.

కేటీఆర్ తప్పు ఒప్పుకున్నారా ?

ఎందుకంటే సిట్టింగులకే మళ్ళీ టికెట్లు ఇవ్వద్దని చాలా నియోజకవర్గాల్లోని నేతలు కేసీయార్ ను కలిసి మొత్తుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 4:30 PM GMT
కేటీఆర్ తప్పు ఒప్పుకున్నారా ?
X

ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజులకు కేటీయార్ ఒక విషయాన్ని అంగీకరించారు. అదేమిటంటే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధులను మార్చకపోవటం వల్లే పార్టీ ఓడిపోయిందని. అసెంబ్లీ అభ్యర్ధులను మార్చకుండా సిట్టింగులకే మళ్ళీ టికెట్లు ఇవ్వటం వల్లే ఇపుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చిందని అంగీకరించారు. అభ్యర్దులను మార్చుంటే కేసీయార్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయ్యేవారని కేటీయార్ చెప్పారు. కేటీయార్ తాజా వ్యాఖ్యలు కేసీయార్ నిర్ణయాన్ని తప్పుపట్టేట్లుగా ఉన్నాయని పార్టీలో చర్చ మొదలైంది.

ఎందుకంటే సిట్టింగులకే మళ్ళీ టికెట్లు ఇవ్వద్దని చాలా నియోజకవర్గాల్లోని నేతలు కేసీయార్ ను కలిసి మొత్తుకున్నారు. అయినా సరే ఎవరెంత చెప్పినా వినకుండా కేసీయార్ అన్నీ నియోజకవర్గాల్లోను సిట్టింగులకే మళ్ళీ టికెట్లిచ్చారు. అయితే చివరి నిముషంలో ఏమైందో ఏమో తెలీదు 12 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చారు. దాని ఫలితం కౌంటింగ్ లో స్పష్టంగా కనబడింది. ఎలాగంటే చివరి నిముషంలో అభ్యర్ధులను మార్చిన 12 నియోజకవర్గాల్లో 10 చోట్ల కొత్త అభ్యర్ధులు గెలిచారు. ఇదే విషయం బీఆర్ఎస్ ఓడిన దగ్గర నుండి పార్టీలో పదేపదే చర్చకు వస్తోంది.

అదే విషయాన్ని కేటీయార్ ఇపుడు స్వయంగా అంగీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును పార్టీ తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కానివ్వమని నేతలతో జరిగిన సమీక్షలో హామీ ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయించబోయే అభ్యర్ధుల విషయాన్ని ఆచితూచి నిర్ణయిస్తామని భరోసా ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మొత్తం 17 పార్లమెంటు సీట్లలో బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నది 9 సీట్లు మాత్రమే.

ఇందులో కూడా దుబ్బాక నుండి గెలిచిన మెదక్ ఎంపీ రాజీనామా చేసేశారు. అంటే నికరంగా బీఆర్ఎస్ కున్నది 8 మంది ఎంపీలు మాత్రమే. అంటే మిగిలిన తొమ్మిది నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్ధులను ఎంపిక చేయాల్సిందే. మరిక్కడ నుండి మాజీలకే టికెట్లిస్తారా లేకపోతే పూర్తిగా కొత్తమొహాలను పోటీలోకి దింపుతారా అన్నది తెలీదు. అలాగే 8 సిట్టింగ్ ఎంపీల్లో ఎంతమందికి తిరిగి టికెట్లిస్తారన్నది సస్పెన్సుగా మారింది. ఏదేమైనా చేసిన తప్పును అంగీకరించటంలో చిత్తశుద్ది ఉంటే తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి.