Begin typing your search above and press return to search.

ఆ మాట రేవంత్ ను అంటున్నారు అనుభవంతోనేనా కేటీఆర్?

తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు సైతం నిర్ఘాంతపోయినట్లుగా చెప్పుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 March 2024 9:49 AM GMT
ఆ మాట రేవంత్ ను అంటున్నారు అనుభవంతోనేనా కేటీఆర్?
X

మాట అనే ముందు మరీ లోతుల్లోకి వెళ్లకపోయినా.. ఒక అడుగు వెనక్కి.. ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడాల్సిన అవసరం బాధ్యత కలిగిన నేతల్లో ఉంటుంది. ఈ చిన్న పాయింట్ ను అంత తెలివైన కేటీఆర్ ఎలా మిస్ అవుతున్నారు? అన్నదిప్పుడు గులాబీ దళాల్ని తొలిచేస్తున్న ప్రశ్న. అధికారం తమ చేతిలో ఉంటే ఒకలా.. పక్కోడి చేతిలో ఉంటే మరోలా మాట్లాడటం ఒక స్థాయికి చేరిన తర్వాత బాగోదన్న విషయాన్ని చిన్న బాస్ మిస్ అవుతున్నట్లుగా ఉంది. మొన్నటి వరకు అధికారం తమ చేతిలోనే ఉందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నారా? తానిప్పుడు ఆరోపణలు చేస్తున్న మున్సిపల్ శాఖ తానే నిర్వర్తించారన్న విషయాన్ని మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

తాజాగా నిర్వహించిన పార్టీ సమావేశంలో కేటీఆర్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు సైతం నిర్ఘాంతపోయినట్లుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి ఆరోపణలు చేశారు మరి. మున్సిపల్ శాఖను తన వద్దనే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు నెలలుగా డబ్బులిస్తేనే బిల్డింగులకు అనుమతులు మంజూరు చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరరోపణ చేశారు. అలా వసూలు చేసిన రూ.2500 కోట్లను ఢిల్లీకి పంపినట్లుగా చెప్పారు. వంద రోజులకే రూ.2500 కోట్లు అయితే పదేళ్లలో ఎన్ని వేల కోట్లు? అన్న ప్రశ్న ఇప్పుడు కేటీఆర్ కు ఎదురవుతోంది. కారణం.. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖా మంత్రి బాధ్యతల్ని నిర్వర్తించింది కేటీఆరే అన్నది మర్చిపోకూడదు.

‘మంత్రి కేటీఆర్ అనుభవంతో చెబుతున్నట్లుగా ఉంది. ఓవైపు రియల్ ఎస్టేట్ బాగోలేదని అంటున్నారు. మరోవైపు అనుమతులు ఇవ్వటం లేదంటున్నారు. అలా అయితే రూ.2500 కోట్లను వంద రోజుల్లో ఎలా సేకరిస్తారు? కొత్త ప్రాజెక్టులను ఆచితూచి అన్నట్లుగా అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని అనుమతులు ఇస్తున్నప్పుడు వసూళ్లకు సాధ్యమవుతుందా?’ అని ప్రశ్నిస్తున్నారు. గతంలో రియల్ ఎస్టేట్ మాంచి ఊపులో ఉందని.. భారీ భవనాలకు.. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు గత ప్రభుత్వం ఎడాపెడా అనుమతులు ఇచ్చేసింది. అంటే.. వేలాది కోట్లు కేటీఆర్ వెనకేసుకున్నట్లేనా’’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒకవేలు ఎదుటోడి వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయన్న చిన్న పాయింట్ ను కేటీఆర్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. జేబులో కత్తెర పెట్టుకొని దొంగలా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఇంతకూ రేవంత్ జేబులో కత్తెర ఉందన్న విషయం కేటీఆర్ కు ఎలా తెలిసింది? అన్నది మరో ప్రశ్న. సీఎం రేవంత్ చేసిన విమర్శలపైనా కేటీఆర్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాకుంటే.. అందులో ఎక్కువ భాగం రివర్సులో తగులుతున్నట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. పదేళ్లు అధికారంలో ఉండి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. అందుకు భిన్నంగా రివర్పులో చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజల్లో పెద్దగా స్పందన లేదంటున్నారు.

రేవంత్ చేతిలో అధికారం ఉందని.. ఏం చేస్తావో చేయ్.. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని.. ఆయన బెదిరింపులకు ఎవరూ భయపడేవారెవరూ లేరన్న కేటీఆర్ నోటి నుంచి మరో ఆసక్తికర వ్యాఖ్య వచ్చింది. ‘పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతేనని జోస్యం చేసిన ఆయన.. తాను చేసిన వ్యాఖ్య మీద స్పందించాలనటం గమనార్హం. ఓపక్క బీఆర్ఎస్ లో నుంచి ఒకరు తర్వాత మరొకరు చొప్పున కారు దిగేస్తుంటే.. దానికి సమాధానం చెప్పలేని కేటీఆర్.. సీఎం రేవంత్ పై నోరు పారేసుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. తన మాటలకు కేటీఆర్ కాస్తంత విరామం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.