Begin typing your search above and press return to search.

మరీ ఇంత బ్యాడ్ టేస్ట్ ఏంది కేటీఆర్?

రాజకీయాలన్నంతనే విమర్శలు.. ప్రతి విమర్శలు మామూలే అయినా.. మరీ నాటుగా మాటలు అనేయాల్సిన అవసరం లేదన్నది మర్చిపోకూడదు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:52 AM GMT
మరీ ఇంత బ్యాడ్ టేస్ట్ ఏంది కేటీఆర్?
X

‘కనకపు సింహాసమున శునకమును గూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’’ అంటూ పాత సామెతను సరికొత్తగా ట్వీట్ చేయటం ద్వారా మరో సంచలనానికి తెర తీశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ వేమన శతకంలోని పద్యానికి భావం చూస్తే.. ‘‘ఒక మంచి ముహుర్తంలో కుక్కను బంగారు సింహసనం పైన కూర్చోబెట్టి పట్టాభిషేకము చేసినా దాని నీచ స్వభావమును వదిలిపెట్టరు. అలాగే ఒక నీచున్ని ఉన్నత పదవిని ఇచ్చినా వాడు తన నీచ స్వభావమును విడవడు’’ అంటూ తాను చెప్పాలనుకున్న మాటను.. అనాలనుకున్న వారిని అనేశారు కేటీఆర్. ఇక్కడ సమస్య ఏమంటే.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారిని ఉద్దేశించి ఎంత మాట పడితే అంత మాట అనేయటమా అని?

ఎందుకంటే.. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఘాటు విమర్శ చేసినంతనే.. ఏమైనా బుద్ధి ఉందా అండి? ముఖ్యమంత్రిని పట్టుకొని అంత మాట అనేస్తారంటూ నాటి విపక్ష నేతలు చేసే విమర్శలపైనా విరుచుకుపడే వారు కేటీఆర్ అండ్ కో. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ సైతం తన ప్రసంగాల్లో సీఎంను పట్టుకొని అంత మాట అంటారా? అసలు వీరికి మర్యాద తెలుసా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. మరి.. నాడు చెప్పిన నీతులు ఇప్పుడు ఏమైపోయాయి? అన్నది ప్రశ్న.

రాజకీయాలన్నంతనే విమర్శలు.. ప్రతి విమర్శలు మామూలే అయినా.. మరీ నాటుగా మాటలు అనేయాల్సిన అవసరం లేదన్నది మర్చిపోకూడదు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. తన మాటల తీవ్రతను అంతకంతకూ పెంచేస్తున్నారు కేటీఆర్. డైలీ బేసిస్ లో ఆయన రేవంత్ సర్కార్ ను టార్గెట్ చేయటం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఘాటు విమర్శలు చేయటం రోటీన్ గా మారింది.

తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన వేమన శతకంలోని పద్యం ఎవరిని ఉద్దేశించిందన్న విషయం చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు.. తాము అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు చేసే వారిని తాము ఏమేం అన్నామన్న విషయాన్ని మర్చిపోకూడదు. గతాన్ని వదిలేసి.. వర్తమానం గురించి మాత్రమే మాట్లాడదామనుకున్నా.. రేవంత్ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులే అయ్యింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన మాటల్లోనూ చెబుతున్నారు.

ఒక ప్రభుత్వం ఏర్పాటైన యాభై రోజుల వ్యవధిలోనే ఇన్నేసి మాటలు అనటమా? అన్నది ప్రశ్న. ఇక్కడ ఇంకొకటి కూడా ప్రస్తావించాలి. ఈ యాబై రోజుల పాలనలో తామిచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో రెండింటిని పూర్తి చేసి.. మరోరెండింటిని ఫిబ్రవరిలో అమలు చేస్తామని చెప్పిన నేపథ్యంలో.. వంద రోజుల వరకు వెయిట్ చేసి ఆ తర్వాత నాలుగు మాటలు అంటే బాగుంటుంది. కానీ.. అలాంటి అవకాశం ఇవ్వకుండా నిద్ర లేచింది మొదలు రేవంత్ ప్రభుత్వాన్ని పట్టుకొని నానా మాటలు అనటం ద్వారా.. కేటీఆర్ తన బ్యాడ్ టేస్టును బయటపెట్టుకుంటున్నారన్న మాట వినిపిస్తోంది. ఆయన తీరుతో.. అయ్యో ఓడిపోయారే అన్న భావన కన్నా.. దానికి మించిన వ్యతిరేక భావం ప్రజల్లోకి కలుగుతుందన్న విషయాన్ని ఆయన మిస్ అవుతున్నట్లుగా చెబుతున్నారు. మాటల్లో సంమయమనం.. ట్వీట్లలోనూ ఆచితూచి అన్నట్లుగా నిర్ణయం తీసుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.