Begin typing your search above and press return to search.

కేటీఆర్ నాటి మోరీ మాట.. కారుకు శాపం?

అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. ఆ అధికారం చేజారిన తర్వాత చెప్పే మాటలకు పొంతన ఉండదు.

By:  Tupaki Desk   |   11 May 2024 4:32 AM GMT
కేటీఆర్ నాటి మోరీ మాట.. కారుకు శాపం?
X

అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాటలకు.. ఆ అధికారం చేజారిన తర్వాత చెప్పే మాటలకు పొంతన ఉండదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. కారు పార్టీ కీలక నేతల్లో ఒకరైన కేటీఆర్ నోటి నుంచి చాలానే మాటలు వస్తుంటాయి. తాము అధికారంలో ఉన్న వేళలో వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ ఆయన అధికార పక్షానికే ఓటు వేయాలని చెప్పేవారు. అందుకు భిన్నంగా ఓటేస్తే.. మోరీలో వేసినట్లుగా చెప్పేవారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తప్పించి ఇంకెవరికి ఓటేసినా లాభం ఉండదన్న సిద్ధాంతాన్ని వినిపించేవారు.

కొన్ని సందర్భాల్లో రాష్ట్రంలో పవర్ లో ఉన్న పార్టీకి ఓటు వేయని పక్షంలో.. ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్న వార్నింగ్ ఇచ్చేవారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ కేటీఆర్ చెబుతున్న మాటలు.. గతంలో ఆయన చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. తమకు పదిహేను సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని ఆయన చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదిహేను సీట్లా? అన్న ఆశ్చర్యాన్ని పక్కన పెట్టేసి.. నిజంగానే కేటీఆర్ కోరుకున్నట్లుగా పదిహేను సీట్లు వచ్చాయనే అనుకుందాం? అప్పుడేం జరుగుతుంది? అన్నది చూద్దాం.

కారు పార్టీకి కేంద్రంలోని కొలువు తీరే రెండు పార్టీలతో ఉన్న సంబంధాల్ని చూస్తే.. కాంగ్రెస్ తో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు పొసిగే అవకాశం లేదు. అందునా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికార పక్షంగా ఉన్న నేపథ్యంలో కారు పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినా ఆయన్ను దగ్గరకు చేర్చుకునే ఛాన్సు లేదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కానీ.. దాని మిత్రపక్షాలన్ని కలిపినా కూడా కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. కేసీఆర్ ను మిత్రపక్షంగా ఎంచుకోవటం అసాధ్యం.

ఇక మిగిలింది.. మోడీ సర్కారు. ఎన్డీయే కూటమిలో కేసీఆర్ కు ఉండే అవకాశాలు చాలా చాలా తక్కువ. ఎన్నికల్లో కారు పార్టీ అనూహ్యంగా పదిహేను సీట్లను సొంతం చేసుకుందనే అనుకుందాం. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందనే భావిద్దాం. తన దగ్గరున్న పదిహేను సీట్లతో మోడీ వద్దకు కేసీఆర్ వెళితే.. ఆయన్ను స్వాగతిస్తారా? అన్నది సందేహం. అంటే.. అటు యూపీఏ కూటమితో కానీ ఎన్డీయే జట్టులో కానీ కేసీఆర్ ను చేర్చుకునే ఛాన్సుల్లేవు. అలాంటప్పుడు కేసీఆర్ కు పదిహేను ఎంపీ స్థానాలు ఇస్తే.. కలిగే ప్రయోజనం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న.

ఇలాంటి సమయాల్లోనే కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు యాదికి వస్తాయి. అధికారంలో లేని పార్టీకి ఓటేస్తే.. మోరీలో పడినట్లేనంటూ గతంలో ఆయన వల్లె వేసిన సిద్దాంతం గుర్తుకు వస్తుంది. అందుకే అంటారు.. తొందరపడి చెప్పే మాటలు అప్పటికి బాగానే ఉన్నా.. కాల పరీక్షలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇప్పుడు కారు పార్టీ అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది.