Begin typing your search above and press return to search.

కేటీఆర్ ప్రచారం షురూ చేసిన ఊరేమిటో..ప్రత్యేకత ఏమిటో తెలుసా?

కేటీఆర్ ప్రచారం షురూ చేసిన సారంపల్లి సిరిసిల్లకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 Aug 2023 5:30 PM GMT
కేటీఆర్ ప్రచారం షురూ చేసిన ఊరేమిటో..ప్రత్యేకత ఏమిటో తెలుసా?
X

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టయిలే వేరు. సూటిగా ప్రశ్నిస్తూ ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతుంటారు. ప్రభుత్వ పథకాలను చక్కగా వివరిస్తూ.. ప్రగతిదాయక కార్యక్రమాలను చెబుతూ ముందుకుసాగుతుంటారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు కేటీఆర్ ఇప్పుడు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొన్నేళ్ల కిందటే బాధ్యతలు చేపట్టిన ఆయన.. ప్రభుత్వంలోనూ అత్యంత కీలకమనే సంగతి అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం అనే వార్తలు రెండేళ్లుగా హల్ చల్ చేస్తున్నాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చినప్పటికీ అది సాధ్యం కాలేదు. నాలుగు నెలల్లో జరగనున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నెగ్గితే ఏం జరుగుతుందో చూడాలి.

అమెరికా నుంచి.. సిరిసిల్లకు

తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో తొలి ఐదారేళ్లు ఉద్యోగ రీత్యా కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడంతో కేటీఆర్ స్వదేశానికి తిరిగొచ్చి అప్పటి టీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించారు. 2009 ఎన్నికల నాటికి ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఎదిగారు. నాడు టీఆర్ఎస్-టీడీపీ-వామపక్షాలు కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. కేటీఆర్ సిరిసిల్ల నుంచి పోటీ చేసి నెగ్గారు.

నాడు మెజార్టీ 171.. తర్వాత 70 శాతం ఓట్లు

2009 ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నుంచి కేటీఆర్ తీవ్ర పోటీని ఎదుర్కొన్నారు. ఓ దశలో ఓటమి ఖాయం అనుకున్నారు కూడా. కేవలం 171 ఓట్లతో కేటీఆర్ బయటపడ్డారు. నాడు కేటీఆర్ కు వచ్చిన ఓట్లు కేవలం 26.9 శాతం. కేకే మహేందర్ రెడ్డికి 26.8 శాతం ఓట్లు వచ్చాయి. కానీ, 2014 ఎన్నికల్లో కేటీఆర్ ఓట్ల శాతాన్ని 58.36 శాతానికి పెంచుకున్నారు. ఇక 2018 నాటికైతే ఏకంగా 70.89 శాతానికి చేరింది. అంటే రెండు ఎన్నికలకు ఓట్ల శాతం దాదాపు మూడు రెట్లు పెరిగింది. మొత్తం 1.75 లక్షల ఓట్లలో కేటీఆర్ కు 1.25 లక్షల వరకు పోలవడం విశేషం.

ఆధిక్యం లక్ష దాటిస్తారా?

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉంది. అధికార పార్టీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కు ఉవ్విళ్లూరుతుండగా.. కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కనిపిస్తోంది. కాగా, ఎన్నికల కోసం ప్రచారం స్టార్ చేసినట్లు ప్రకటించారు కేటీఆర్. మంగళవారం సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. సిద్దిపేట నుంచి సిరిసిల్లకు వెళ్లే దారిలో ఉండే సారంపల్లి అనే గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గతంలోనూ ఇక్కడి నుంచే కేటీఆర్ ప్రచారం మొదలుపెట్టేవారు. కాగా, గత ఎన్నికల్లో కేటీఆర్ ఆధిక్యం 89,009 వద్ద ఆగిపోయింది. అంతకుముందు 53,004 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. ఈసారి ఆధిక్యం లక్ష ఓట్లు దాటించాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.

చిన్న ఊరు.. కల్లుకు ఫేమస్

కేటీఆర్ ప్రచారం షురూ చేసిన సారంపల్లి సిరిసిల్లకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తాటి కల్లుకు ఫేమస్ ఈ గ్రామం. టెక్ట్స్ టైల్ పార్క్ సారంపల్లి పరిధిలోనే ఉంది. ఇక్కడే మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కేటీఆర్. పంద్రాగస్టు, సర్వాయి పాపన్న ఆశీస్సులతో ముందుకెళ్తానని ప్రకటించారు.