Begin typing your search above and press return to search.

కేటీఆర్ బరెస్ట్.. కట్టుదాటిన మాటలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలతో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ వార్తల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   17 Jun 2025 9:42 AM IST
కేటీఆర్ బరెస్ట్.. కట్టుదాటిన మాటలు
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలతో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ వార్తల్లో నిలిచారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ పూర్తయ్యాక కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుమారు ఏడు గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ కార్యాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ తన ఆగ్రహాన్ని పూర్తిగా వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆయన "నేను లుచ్*గా పనులు చేయను రేవంత్ రెడ్డి... నిండా డబ్బు సంచులు పట్టుకుని పట్టుబడిన వాడిని కాదు. నన్ను ఎక్కువగా 15 రోజులు జైలులో పెట్టగలవు... నేనైతే తెలంగాణ ప్రజల కోసం సిద్ధం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంతటితో ఆగకుండా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఉన్న పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "హౌ*లా" అంటూ అభ్యంతరకర నినాదాలు చేయడం మరింత వివాదాస్పదంగా మారింది.

ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నేతగా, దేశం చూసే బాధ్యత ఉన్న వ్యక్తిగా కేటీఆర్ ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం శోచనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన వంటి చదువుకున్న యువనాయకుని నుంచి మరింత బాధ్యతాయుతమైన ప్రవర్తనను ప్రజలు ఆశిస్తున్నామని పలువురు వ్యాఖ్యానించారు.

ఏసీబీ విచారణపై ఆగ్రహం వ్యక్తీకరించడం సహజమేనని కొందరు భావించినా, ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో వ్యక్తిగత దూషణలు చేయడం దారుణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది రాబోయే రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపనుంది అని విశ్లేషణలు మొదలయ్యాయి.