లోకేష్ కేటీఆర్ ఇద్దరూ మాస్ లీడర్లుగా ఎదగడం లేదా ?
తెలుగు నాట ఇద్దరు వారసులు ఉన్నారు. వారి తండ్రులు ఇద్దరూ చంద్రులే. ఆ ఇద్దరు చంద్రులూ స్వయం ప్రకాశం కలిగిన వారే.
By: Satya P | 18 Sept 2025 10:00 PM ISTతెలుగు నాట ఇద్దరు వారసులు ఉన్నారు. వారి తండ్రులు ఇద్దరూ చంద్రులే. ఆ ఇద్దరు చంద్రులూ స్వయం ప్రకాశం కలిగిన వారే. రాజకీయంగా చూస్తే దిగ్గజ నేతలే. సుదీర్ఘమైన కాలం వారు రాజకీయాలను కొనసాగించారు. ఏడు పదుల వయసులో సైతం ఇప్పటికీ నాటౌట్ అని అంటున్నారు. ఈ ఇద్దరికీ వారసులు ఉన్నారు. తమ రాజకీయ సామ్రాజ్యానికి కుమారులే వారసులు కావాలని తండ్రులు తపిస్తున్నారు. తమ రాజకీయ తపస్సును అంతా వారి కోసం ధారపోస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అయితే మరొకరు తెలంగాణా మాజీ సీఎం కె చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్. కేసీఆర్ కి కేటీఆర్ రాజకీయ వారసుడు అయితే బాబుకు ఏకైక వారసుడిగా నారా లోకేష్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఇపుడు సీఎం సీటు కోసం వేచి చూస్తున్న యువ నేతలుగా గుర్తింపు పొందారు.
ఇద్దరి విషయం తీసుకుంటే :
ఇక కేటీఅర్ కానీ లోకేష్ కానీ తీసుకుంటే ఇద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. కొన్ని తేడాలు ఉన్నాయి. పోలీకలు ఏమిటి అంటే ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. విదేశాలలో బాగా విద్య నేర్చిన వారే. ఇక వయసు రిత్యా చూసుకుంటే కేటీఆర్ పెద్ద వారు. ఆయన రాజకీయ జీవితంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. లోకేష్ అయితే 2024లోనే తొలిసారి గెలిచారు. ఇక దీని కంటే ముందు తీసుకుంటే ఇద్దరూ మునిసిపలి ఐటీ మంత్రులుగా పనిచేశారు. అయితే ఆనాడు మంత్రిగా కేటీఆర్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. లోకేష్ విషయం అయితే ఎవరూ పెద్దగా ఆలోచించేవారు కాదని చెబుతారు.
లోకేష్ రాటు తేలిన వేళ :
అయితే లోకేష్ విపక్షంలోకి వచ్చాకనే బాగా రాటు తేలారు అని చెప్పాలి. యువగళం పాదయాత్రతో ఆయన జనంలోకి వెళ్ళడంతో ఇంకా గట్టి పడ్డారు. జనంతో మమేకం కావడమే కాదు ప్రజా సమస్యల మీద ఆయన తనకంటూ ఒక అవగాహన పెంచుకున్నారు ఆ మీదట ఆయనలో ఆలోచించే విధానం దృష్టి కోణం కూడా బాగా మారాయని చెబుతారు. వీటితో పాటుగా మరో కీలక ఘట్టం అయితే లోకేష్ ని బాగా మార్చేసింది అని చెప్పాలి. అదేంటి అంటే చంద్రాబాబు అరెస్టు అయి 2023 సెప్టెంబర్ 10న జైలుకు వెళ్ళారు ఏకంగా 53 రోజుల పాటు ఆయన జైలు జీవితం అనుభవించారు ఆ సమయంలో లోకేష్ బాగా కష్టపడ్డారు. అలా తనకంటూ సొంత నాయకత్వం ఆనాడు పెంపొందించుకున్నారు. ఆ జోరు ఆగలేదు, 2024 ఎన్నికల ముందు మాత్రం లోకేష్ ఏపీ నాలుగు చెరగులా కలియతిరిగారు. దాంతో టీడీపీకి కొత్త బూస్ట్ వచ్చింది. ఫలితంగా అద్భుతమైన విజయం దక్కింది అని అంటారు.
కేటీఆర్ ఇమేజ్ అలా :
అదే విధంగా చూస్తే కేసీఆర్ నీడలో ఆయన అడుగు జాడలో కేటీఆర్ ఎదిగారు అని చెప్పాలి. అచ్చం తన తండ్రి మాదిరిగా రాజకీయం చేయడమే ఆయన అలవాటు చేసుకున్నారు. అయితే కేసీఆర్ రాజకీయ చాణక్యం ఆయన వ్యూహాలు ఇంకా కేటీఆర్ కి పట్టుబడ్డాయా అన్నది ఆలోచించాలని అంటున్నారు. అంతే కాదు కేసీఆర్ మాట్లాడితే చాలు మాస్ ని ఎట్రాక్ట్ చేస్తుంది ఆయన గొంతు కోట్లాది మందిని కదిలిస్తుంది. ఆయన మాటలలో యాస చమక్కులు సెటైర్లు విమర్శలు అన్నీ నిప్పు రవ్వల మాదిరిగా ఉంటాయి. కేసీఆర్ స్పీచ్ కానీ ఆయన నినాదాలు కానీ ఎంతటి పవర్ ఫుల్ అన్నది అందరికీ తెలిసిందే. అయితే కేటీఆర్ మాత్రం క్లాస్ లీడర్ గానే ఇంకా జనాల్లో ఇమేజ్ సాధించగలిగారు అని అంటారు. చదువుకున్న వారిలో పట్టణ వాసులలో కేటీఆర్ కి ఫాలోయింగ్ కనిపిస్తుంది
లోకేష్ కూడా అంతేనా :
ఇక ఏపీలో చూస్తే నారా లోకేష్ కూడా మాస్ పల్స్ ని పట్టుకోలేకపోతున్నారు. ఆయనకి కూడా విద్యా వంతులలో అర్బన్ ఏరియాల్లోనే మంచి ఇమేజ్ ఉంది. ఆయన మాటలను ఆయన స్పీచ్ లను ఎక్కువగా వారే వింటూ ఆకర్షితులవుతారు. లోకేష్ మాస్ డైలాగులు కొడుతున్నా అవి రూరల్ జనాలకు అయితే అంతగా తాకడం లేదు రూరల్ లో అయితే లోకేష్ ఒక అర్బన్ లీడర్ గానే కనిపిస్తారు అని అంటున్నారు. లోకేష్ మూలాలు రాయలసీమలో ఉన్నా పుట్టింది పెరిగింది అంతా హైదరాబాద్ ఓ కావడంతో చదువులు అన్నీ కూడా విదేశాలలో కావడంతో అర్బన్ ఫ్లేవర్ ఆయన చుట్టూ అలాగే ఉంటోంది.
మాస్ కి కనెక్ట్ కావాలంటే :
మాస్ ఇమేజ్ అన్నది వెండి తెర కధానాయకుడికి అయినా లేక రాజకీయ నాయకుడికి అయినా అవసరం. మాస్ పల్స్ ని పసి కట్టిన వారే సూపర్ సక్సెస్ అవుతారు అయితే మాస్ ని కదిలించడం అన్నది చాలా కష్టం. మాస్ తో ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం అది లైఫ్ లాంగ్ బాండింగ్ గా ఉంటుంది. ఆ విషయంలో చూస్తే అటు కేటీఆర్ ఇటు లోకేష్ తన వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వారు మాస్ లీడర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునేలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజుకీ చూస్తే కనుక మాస్ లీడర్లు అంటే తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో జగన్ అనే అంతా అంటారు. ఈ ఇద్దరికీ మాస్ ఇమేజ్ అధికంగా ఉంది ప్రధానంగా రూరల్ సెక్టర్ లలో వారికి తిరుగులేదు అన్నట్లుగా ఉంటుంది. అంతలా వారు కనెక్ట్ అయిపోయారు. మరి కేటీఅర్ కానీ లోకేష్ కానీ ఆ గ్రాఫ్ ని అందుకోవాలంటే చాలా చేయాల్సి ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
