Begin typing your search above and press return to search.

డల్లాస్ లో కేటీఆర్ మీటింగ్.. F1, H1B వాళ్లకు నోటీసులు

ఎలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు, చర్యలు, మీటింగ్ లకు దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు కేటీఆర్ పర్యటన అమెరికాలోని ప్రవాస భారతీయులన చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   3 Jun 2025 4:51 PM IST
డల్లాస్ లో కేటీఆర్ మీటింగ్.. F1, H1B వాళ్లకు నోటీసులు
X

ఎలాగైనా సరే విదేశీయులను తరిమివేయాలి. అమెరికాలో ఉద్యోగాలను అమెరికన్లకే ఇవ్వాలని కంకణం కట్టుకున్న ట్రంప్ విదేశీయులపై నజర్ పెంచారు. వారు తుమ్మినా దగ్గినా కూడా ఏదో ఒక కారణం చూపించి వీసా రద్దులు.. దేశం నంచి తరిమివేసేలా అధికార యంత్రాంగం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. భారతీయుల జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదీ. ఎలాంటి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు, చర్యలు, మీటింగ్ లకు దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు కేటీఆర్ పర్యటన అమెరికాలోని ప్రవాస భారతీయులన చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజాగా అమెరికా చేరుకున్నారు. డల్లాస్‌లో జరిగిన తెలంగాణ ఫౌండేషన్ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరు అయ్యారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ర్యాలీ , దాని పర్యవసానాలపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో నివాసం ఉంటున్న F1 (విద్యార్థి), H1B (ఉద్యోగ) వీసాదారుల భవిష్యత్తుపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న చర్చ జరుగుతోంది.

ట్రంప్ పరిపాలనలో వలసేతరులు ఏ చిన్న పొరపాటు చేసినా వారిపై దృష్టి సారించే ధోరణి ఇటీవల పెరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వడం, వేలిముద్రలు తీసుకోవడం, H1B పొడిగింపులు, OPT (Optional Practical Training) నుండి STEM OPTకి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు సృష్టించడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. గతంలో కొంతమంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో వైసీపీ, టీడీపీ, జనసేన జెండాలను ప్రదర్శించినందుకు నోటీసులు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికాలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కార్యకలాపాలు చేయవచ్చు గానీ, సొంత దేశ రాజకీయాలకు సంబంధించిన రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

-కేటీఆర్ ర్యాలీ, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు:

కేటీఆర్ డల్లాస్ విమానాశ్రయం నుండి తెలంగాణ ఫౌండేషన్ కార్యక్రమానికి వెళ్ళే మార్గంలో భారీ ర్యాలీ నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ ర్యాలీ వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, H1B వీసాదారులు పాల్గొని హడావుడి చేశారని తెలుస్తోంది. ఈ ర్యాలీకి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోలేదని, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ర్యాలీ కారణంగా కొందరు అసౌకర్యానికి గురైనట్లు, వారు సంబంధిత విభాగాలకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారులు ఈ ఫిర్యాదులపై విచారణ జరుపుతున్నారని, ర్యాలీకి సంబంధించిన వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఫిర్యాదులు నిజమని తేలితే, ఈ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, H1B వీసాదారులు కేసులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

- వలసేతరులపై పెరుగుతున్న ఒత్తిడి:

ట్రంప్ పరిపాలనలో వలసేతరులకు పెద్ద ఎత్తున నోటీసులు వస్తున్నాయని, చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే అనేక ఉదాహరణలున్నాయి. మన వారు కూడా కొంతమంది తమ జీవితాలను చూసుకోకుండా, విదేశాలకు వెళ్లి రాజకీయాలు, కుల వివాదాలను ఇక్కడకు తెస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కుల రాజకీయాలు చేసి, రాజకీయ సమావేశాల్లో పాల్గొని, హడావుడితో నోటీసుల దాకా తెచ్చుకోవడం ఎందుకని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి లేదా ఉద్యోగం చేయడానికి వచ్చిన వారు, అక్కడి నిబంధనలను గౌరవించి, తమ వ్యక్తిగత జీవితాలపై దృష్టి సారించడం శ్రేయస్కరం అని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో అగ్రరాజ్యంలో స్థిరపడాలనే వారి కలలు కల్లలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.