కవిత మాటెత్తకుండానే.. కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగం!
ఈ సందర్భంగా ఆయన 40 నిమిషాల సేపు మాట్లాడారు. దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదేసమయంలో తమ పార్టీ భవితవ్యంపై మాట్లాడారు.
By: Tupaki Desk | 26 May 2025 10:59 PM ISTబీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్.. సుదీర్ఘ ప్రసంగం చేశారు. 40 నిమిషాల పాటు ఆయన మాట్లాడారు. తాజాగా సోమవారం సాయంత్రం గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ 50 మంది వరకు బీఆర్ ఎస్ గూటికి చేరుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పిన కేటీఆర్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన 40 నిమిషాల సేపు మాట్లాడారు. దీనిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అదేసమయంలో తమ పార్టీ భవితవ్యంపై మాట్లాడారు.
కానీ.. అందరూ ఎదురు చూస్తున్నట్టుగా పార్టీ కీలక నాయకురాలు.. కేటీఆర్ సోదరి కవిత గురించి పన్నెత్తు మాట కూడా కేటీఆర్ ప్రస్తావించలేదు. గతంలో రెండు రోజుల కిందట ఆయన కవిత లేఖ పై స్పందించా రు. పార్టీ లైన్‌లోనే అందరూ నడవాలని.. ఎవరూ ఎక్కువ తక్కువలు కారంటూ.. కవితను ఉద్దేశించి.. ఆమె కూడా పార్టీ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాలన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఎవరైనా గీత తప్పితే.. పార్టీ అధినేత చూస్తారని అన్నారు. తద్వారా కవితపై చర్యలు ఉంటాయని పరోక్షంగా కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత.. మళ్లీ మీడియా ముందుకు రాలేదు. తాజాగా గద్వాల్ కు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలను చేర్చుకుని.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిందలు-దందాలు-చందాలు అనేదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధానమని.. అభయ హస్తం అంటూ.. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీ ఏమైందని నిలదీశారు. ఇది దోచుకుని.. దాచుకునే ప్రభుత్వమని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి ప్రజల్లో విశ్వసనీయత పోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇక.. తమ బీఆర్ ఎస్ పార్టీ గురించి కూడా మాట్లాడిన కేటీఆర్ .. జూన్ 1 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. బూత్ స్థాయి నుంచి పార్టీలో కమిటీలు ఏర్పాటు చేసి.. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్టు ఆయన వివరించారు. తద్వారా పార్టీలో అందరికీ సముచిత స్తానం కల్పిస్తామని కేటీఆర్ వెల్లడించారు. కానీ.. ఇంత సేపు మాట్లాడినా కవిత ఎపిసోడ్‌ను మాత్రం ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. సో.. దీనిని బట్టి.. కవిత విషయంపై ఎక్కడా మాట్లాడొద్దని కేసీఆర్ ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తున్నట్టేనని అంటున్నారు పరిశీలకులు.
