కాళేశ్వరం.. రేవంత్.. కడిగేసిన కేటీఆర్
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు.
By: Tupaki Desk | 7 Jun 2025 3:04 PM ISTతెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. నీటి విషయంలో దశాబ్దాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో అంతా 'దందాలు, చందాలే' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఎల్సీ రిపోర్ట్ తప్పని, బీజేపీ, కాంగ్రెస్ కార్యాలయాలు కట్టిన సంస్థే చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. సుంకిశాల, ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కూలి ఎనిమిది మంది కార్మికులు చనిపోయినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. కాళేశ్వరం విషయంలో మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
371 పిల్లర్లలో కేవలం రెండు మాత్రమే కుంగాయని, ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయిందని కాంగ్రెస్ నేతలు, మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి పంపిన సొమ్ముతోనే ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం కట్టారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కేసీఆర్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. 'కాళేశ్వరం కమిషన్ పేరిట రేవంత్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది' అని కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేసి నీటిని విడుదల చేయాలని తాము గతంలో కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించిన కేటీఆర్
అంతకుముందు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్‌ను పరామర్శించి, ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మాగంటి గోపీనాథ్‌కు అందుతున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరామర్శలో దాసోజు శ్రవణ్, రవీందర్‌రావు, మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, ఇతర నాయకులు కేటీఆర్‌తో పాటు ఉన్నారు.
