Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు

By:  Tupaki Desk   |   25 April 2025 10:33 PM IST
రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
X

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో "రేవంత్-రాహుల్ ట్యాక్స్" వసూలవుతోందని, ఢిల్లీకి డబ్బుల సంచులు వెళ్తున్నాయని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం రుణమాఫీ చేసిందని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.40 వేల కోట్లు అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే రూ.1.60 లక్షల కోట్ల అప్పులు చేసిందని ధ్వజమెత్తారు.

తెలంగాణ ముఖ్యమంత్రిలో ఒక అపరిచితుడు ఉన్నాడని, ఆయన బయట రాముడిలా, లోపల రెమోలా ఉంటారని కేటీఆర్ విమర్శించారు. బయట అప్పు పుట్టడం లేదని, ఎవరూ నమ్మడం లేదని చెప్పే ప్రభుత్వం, అసెంబ్లీలో మాత్రం లక్షా 58 వేల కోట్ల అప్పు చేశామని అంగీకరిస్తుందని అన్నారు. మళ్లీ బడ్జెట్‌లో మాత్రం తెలంగాణ మిగులు రెవెన్యూ రాష్ట్రంగా చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన రూ.4.17 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచామని, ఇంటింటికి మంచి నీళ్లు అందించామని కేటీఆర్ తెలిపారు. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షా 60 వేల కోట్ల అప్పు చేసి ఏం సాధించిందని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ కౌంటర్:

కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని కౌంటర్ ఇచ్చారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నిరాధారమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. కేటీఆర్ రైతుల రుణమాఫీపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, రుణమాఫీ ప్రక్రియ వేగంగా జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే విచారణలో ఉంది. ఈ కేసులో గత ప్రభుత్వ హయాంలోని కొందరు పోలీసు అధికారులు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. అప్పులు, అభివృద్ధి, హామీల అమలుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.