Begin typing your search above and press return to search.

కేటీఅర్ జైలుకు పోవాలనుకుంటున్నారా ?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు పోవాలని ఉత్సాహపడుతున్నారా, ఆయన అరెస్ట్ గురించి తన పార్టీ వారితో చేసిన వ్యాఖ్యలు ఒక వైపు వైరల్ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   16 Jun 2025 6:02 PM IST
కేటీఅర్ జైలుకు పోవాలనుకుంటున్నారా ?
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు పోవాలని ఉత్సాహపడుతున్నారా, ఆయన అరెస్ట్ గురించి తన పార్టీ వారితో చేసిన వ్యాఖ్యలు ఒక వైపు వైరల్ అవుతున్నాయి. ఆయనను ఏసీబీ అధికారులు తాజాగా పిలిచి విచారించారు. ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాఫ్తు చేస్తున్న నేపథ్యంలో కేటీఅర్ ని మూడవసారి విచారణకు పిలిచారు.

దాని మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ కేసు విషయంలో ముప్పయి సార్లు అయినా ఏసీబీ ముందు విచారణకు తాను హాజరవుతాను అన్నారు. అంతే కాదు ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి వచ్చిన భయపడేది లేదని అన్నారు. గతంలో తెలంగాణా రాష్ట్ర సాధన కోసం జైలుకు వెళ్లాను అని గుర్తు చేశారు.

తన పైన తమ పార్టీ వారి పైనా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు అని ఆయన అన్నారు. అయినా తాము ఎప్పటికీ వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. విచారణ పేరుతో అరెస్టు చేసి జైలులో వేసినా తాను రెడీ అంటూ పదే పదే చెప్పారు కేటీఅర్.

అయితే కేటీఆర్ ఈ ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. నిజానికి సోమవారం కేటీఆర్ ని ఏసీబీ పిలిచి ఏడు గంటల పాటు ఫార్ములా వన్ రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై విచారించింది. దానికి కేటీఆర్ కూడా ఓపికగా జవాబులు చెప్పారని అంటున్నారు. అయితే అవసరం అయితే మరోసారి కేటీఆర్ ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు కోరారని అంటున్నారు. అంటే మరోసారి కూడా కేటీఆర్ ని ఏసీబీ పిలుస్తుంది అని అంటున్నారు.

అయితే ఈ తరహా విచారణల తరువాత అరెస్ట్ చేస్తారు అని కేటీఆర్ నమ్ముతున్నారు. అందుకే అరెస్ట్ చేసుకోండి జైలులో కూడా వేయండి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేశారు. తాను ప్రజల పక్షంగా ఉన్నాను దేనికీ జడిసేది లేదని ఆయన చెబుతున్నారు. మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది.

ఇక ఇపుడిపుడే ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ఇదే సమయంలో విపక్షంగా బీఆర్ఎస్ కూడా పుంజుకుంటోంది. అయితే సరైన పొలిటికల్ హైప్ అయితే రావడం లేదు. దాని కోసమే బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. అందుకేనా కేటీఆర్ తనను అరెస్ట్ చేయమని కోరుతున్నారా లేక పదే పదే ఈ మాటలు అంటూ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.

రాజకీయాల్లో కీలకంగా ఉన్న వారికి ఎవరికైనా అరెస్టు చేసి జైలులో పెడితే కచ్చితంగా అది సింపతీగా మారుతుంది. అనేక సందర్భాలలో అది రుజువు అయింది. బహుశా అందుకేనా కేటీఅర్ నోట అరెస్టు జైలు అన్న మాటలు వస్తున్నాయని అంతా చర్చించుకుంటున్నారు.

దీని మీద కాంగ్రెస్ మంత్రి సీతక్క అయితే కేటీఆర్ మీద సెటైర్లు వేశారు. జైలులు పోవాలని కేటీఆర్ ఉత్సాహపడుతున్నారు అని ఆమె అన్నారు. తన చెల్లెలు జైలుకు వెళ్ళి బీసీ నినాదం అందుకుందని తాను కూడా వెనకబడకుండా జైలుకు పోతే ఏదో ఒక పధకం అక్కడ రచించుకుని బయటకు రావాలను చూస్తున్నారు అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఏదో ఆశించే కేటీఆర్ జైలుకు పోవాలని చూస్తున్నారు అని ఆమె అన్నారు.

నిజంగా కేటీఆర్ అలా ఆలోచిస్తున్నారా అన్నది ఒక చర్చ అయితే కేటీఅర్ కోరినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందా అన్నది మరో చర్చగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అందువల్ల ప్రతిపక్షానికి లాభం కలిగే పని అయితే చేయదని అంటున్నారు. మరి కేటీఆర్ జైలు అరెస్టు అని ఎందుకు అంటున్నారు అంటే అరెస్టు అయినా కాకపోయినా క్యాడర్ లో కొత్త వేడిని ఈ విధంగా పుట్టించడానికే అని అంటున్నారు. చూడాలి మరి కేటీఆర్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ దాకా వ్యవహారం సాగుతుందా అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉంది.